E20 Petrol: E20 పెట్రోల్‌లో క్లోరైడ్, నీళ్లు కలిశాయనే ప్రచారంలో ఎంత నిజం? చమురు కంపెనీల క్లారిటీ
E20 Petrol: E20 పెట్రోల్‌లో క్లోరైడ్, నీరు కలిశాయనే ప్రచారాన్ని చమురు కంపెనీలు ఖండించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెట్రోల్ నాణ్యత ప్రమాణాల ప్రకారమే ఉందని స్పష్టం చేశాయి.
E20 Petrol
E20 Petrol: దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న E20 పెట్రోల్‌లో ప్రమాదకర స్థాయిలో క్లోరైడ్, నీటి శాతం ఎక్కువగా ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్రంగా స్పందించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దావాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. వాహనదారులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, E20 పెట్రోల్ సరఫరా వ్యవస్థ అంతటా నిర్వహించిన తనిఖీల్లో ఇంధన నాణ్యత నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉందని వెల్లడించారు.
రైఫినరీలు, డిస్టిలరీల్లో విస్తృత తనిఖీలు
ఈ వివాదం నేపథ్యంలో చమురు కంపెనీలు సెంటర్ ఫర్ హై టెక్నాలజీ ప్రతినిధులతో కలిసి దేశవ్యాప్తంగా నాణ్యతా పరీక్షలు నిర్వహించాయి. దేశంలోని వివిధ రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ శాంపిల్స్‌ను పరీక్షించగా, వాటిలో క్లోరైడ్ శాతం 1 పిపిఎమ్ లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే పెట్రోల్‌లో కలిపే ఎథనాల్ ఉత్పత్తి చేసే 80 కి పైగా డిస్టిలరీల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో క్లోరైడ్ స్థాయి 3 పిపిఎమ్ కన్నా తక్కువగా నమోదైంది. ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనల పరిమితిలోనే ఈ శాతాలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
పెట్రోల్ బంకుల్లో తనిఖీలు - నలుగురిపై చర్యలు
ఈ ప్రచారాల నేపధ్యంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,000కు పైగా పెట్రోల్ బంకుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇటీవల విశ్లేషించిన 160 శాంపిల్స్‌లో క్లోరైడ్ పరిమాణం 0 నుండి 3 పిపిఎమ్ మధ్యలోనే ఉంది. అయితే తనిఖీల సమయంలో కేవలం 4 ప్రాంతాల్లో మాత్రం క్లోరైడ్ మోతాదు సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన చమురు సంస్థలు ఆ నాలుగు బంకులకు ఇంధన సరఫరాను నిలిపివేసి, లోపాలను సరిదిద్దిన తర్వాతే మళ్లీ సరఫరాను పునరుద్ధరించాయి.
భూగర్భ ట్యాంకుల్లో నీటి కల్తీ లేనట్లే
పెట్రోల్ ట్యాంకుల్లో నీరు చేరుతోందన్న అనుమానాలపై చమురు సంస్థలు స్పందిస్తూ, దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 90,000 పెట్రోల్ బంకుల్లోని భూగర్భ స్టోరేజ్ ట్యాంకులను రోజుకు 8 నుండి 12 సార్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో ఏ ట్యాంకులోకి నీరు ప్రవేశించినట్లు ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. మొబైల్ ఫ్యూయల్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా ఆకస్మిక తనిఖీలు చేస్తూ, స్వతంత్ర గుర్తింపు పొందిన ల్యాబొరేటరీల ద్వారా శాంపిల్స్ పరీక్షలు జరుపుతున్నామని, ఇంధన నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని హెచ్చరించాయి.




