E20 Petrol: E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతోందా? కేంద్రం క్లారిటీ..అసలు కారణాలు ఇవేనట

E20 Petrol:E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

CR Reddy
Published on: 16 Aug 2026 9:51 AM IST
E20 Petrol
X

E20 Petrol

E20 Petrol: 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ పడిపోతోందని చాలామంది వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించింది. నిజ జీవితంలో వాహనం ఇచ్చే మైలేజ్ అనేది మీరు బండి నడిపే తీరు, రోడ్డుపై ఉండే ట్రాఫిక్, టైర్లలో గాలి ఒత్తిడి, ఏసీ వాడకం, వాహనం కండిషన్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. పాత వాహనాలు కొన్నింటిలో E20 పెట్రోల్ వల్ల మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే రోడ్డుపై మైలేజ్ తగ్గడానికి మొత్తం నిందను ఇంధనంపైనే తోయడం సరికాదని పేర్కొంది. మార్కెట్లోకి E20 ఇంధనాన్ని విడుదల చేసే ముందే పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే

మన దేశం తన ముడి చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడుతోంది. ఈ దిగుమతి భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా దేశీయంగా తయారయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగవంతం చేసింది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

పెట్రోల్‌లో నీటి కల్తీ వార్తలు అబద్ధం

పెట్రోల్‌లో నీరు కలవడం వల్ల వాహనాల్లో సమస్యలు వస్తున్నాయనే వార్తలను ప్రభుత్వ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం పూర్తిగా ఖండించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఇంధనంలో క్లోరైడ్ లేదా తేమ (నీరు) పరిమితికి మించి ఉన్నట్లు ఎక్కడా నిరూపణ కాలేదని తేల్చిచెప్పాయి. రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ శాంపిల్స్‌లో క్లోరైడ్ స్థాయి 1 పీపీఎం కన్నా తక్కువగానే నమోదైంది. అలాగే 80 డిపోలు, డిస్టిలరీల నుంచి తీసిన E20 శాంపిల్స్‌లోనూ క్లోరైడ్ పరిమితి లోపే ఉందని స్పష్టమైంది.

90,000 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 90,000 పెట్రోల్ బంకుల్లో భూగర్భ ట్యాంకులను చమురు సంస్థలు నిశితంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో ఏ ఒక్క ట్యాంకులోకి నీరు చేరినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కూడా స్పందిస్తూ చమురు సంస్థలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయని, కల్తీ కేసులు అసలు నమోదు కాలేదని స్పష్టం చేశారు. E20 పెట్రోల్ వల్ల మైలేజ్‌లో వచ్చే స్వల్ప మార్పుల కంటే వాహనం కండిషన్, డ్రైవింగ్ అలవాట్లే ప్రధాన ప్రభావం చూపుతాయి. ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇంధన నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నందున వాహనదారులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story