Mahindra XUV400: జస్ట్ 10 కార్లే.. రేంజ్ అదుర్స్ కానీ ఈ కారును కొనేవాళ్లే కరవయ్యారు

Mahindra XUV400: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ రంగంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా‎ దూసుకుపోతోంది.

CR Reddy
Published on: 26 Sept 2026 9:04 AM IST
Mahindra XUV400
X

Mahindra XUV400

Mahindra XUV400: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ రంగంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా‎ దూసుకుపోతోంది. ముఖ్యంగా మార్కెట్లో BE 6, XEV 9S మోడల్స్ వచ్చిన తర్వాత కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగాయి. టాటా మోటార్స్ తర్వాత ఈ సెగ్మెంట్‌లో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించి ఎంజీ మోటార్స్‌ను సైతం వెనక్కి నెట్టింది. అయితే కంపెనీకి చెందిన ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన మహీంద్రా‎ XUV400 విక్రయాలు మాత్రం పూర్తిగా పడిపోయాయి. గత నెల ఆగస్టులో ఈ కారు దేశవ్యాప్తంగా కేవలం 10 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోవడం గమనార్హం.

గణనీయంగా తగ్గిన కార్ల అమ్మకాలు

గత ఏడాది ఇదే ఆగస్టు 2025లో ఈ కారు 66 యూనిట్లు అమ్ముడైంది. అప్పట్లోనే దీని సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏకంగా 56 యూనిట్ల పతనం చవిచూసింది. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే దీని విక్రయాలు 84 శాతానికి పైగా పడిపోయాయి. మిగతా మోడల్స్ జోరుగా అమ్ముడవుతున్నప్పటికీ, XUV400 మోడల్ మాత్రం కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో వెనుకడుగు వేస్తోంది.

అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ EC PRO, EL PRO అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. ఇందులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్యాష్‌బోర్డ్, డ్యూయల్-టోన్ థీమ్, అడ్వాన్స్‌డ్ క్లైమెట్ కంట్రోల్ ప్యానెల్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ కోసం 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అందించారు. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ రేంజ్, మార్కెట్ పోటీ

ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. 34.5 kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జ్‌పై 375 కిమీ రేంజ్ ఇవ్వగా, 39.4 kWh బ్యాటరీ ప్యాక్ ఏకంగా 456 కిమీ రేంజ్ అందిస్తుంది. అలాగే డ్యూయల్-జోన్ ఏసీ, పానోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, రివర్స్ ఏసీ వెంట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో దీని ప్రధాన పోటీదారు టాటానెక్సాన్ ఈవీతో ఉంది. ఫీచర్లు బలంగా ఉన్నప్పటికీ సేల్స్ ఎందుకు మందగించాయనేది ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.