EV Sales: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

EV Sales: భారతదేశంలో ఆగస్టు 2026లో ఈవీ అమ్మకాలు 52.9 శాతం పెరిగి 2.98 లక్షల యూనిట్లకు చేరాయి. టూ వీలర్లే కీలకంగా నిలిచాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 5:00 AM IST
EV Sales August 2026
X

EV Sales August 2026: India Records 2.98 Lakh Sales

EV Sales: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ మరోసారి దూసుకెళ్లింది. 2026 ఆగస్టులో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 52.9 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 2,98,448 యూనిట్లకు చేరుకున్నాయి. దీంతో మొత్తం వాహన విక్రయాల్లో EVల వాటా కూడా గత ఏడాది ఆగస్టులోని 9.5 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగింది.

67 శాతానికి పైగా పెరిగిన ఈవీ ద్విచక్ర వాహనాలు

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల పెరుగుదలలో ద్విచక్ర వాహనాలు కీలక పాత్ర పోషించాయి. ఆగస్టులో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రిటైల్ అమ్మకాలు 67.05 శాతం పెరిగి 1,83,204 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో 1,09,673 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్ పెరుగుతుండటం ఈ విభాగం వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

అన్ని విభాగాల్లోనూ భారీ వృద్ధి

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఆగస్టులో 20,210 యూనిట్లుగా ఉన్న విక్రయాలు ఈసారి 30,696 యూనిట్లకు చేరుకున్నాయి.

అదే సమయంలో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల అమ్మకాలు 63,736 యూనిట్ల నుంచి 79,846 యూనిట్లకు పెరిగాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల (CV) విభాగంలో అత్యధిక వృద్ధి నమోదైంది.

ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల్లో దాదాపు మూడు రెట్లు వృద్ధి

ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల రిటైల్ అమ్మకాలు గత ఏడాది ఆగస్టులో 1,631 యూనిట్లుగా ఉండగా.. ఈసారి ఏకంగా 4,702 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే దాదాపు మూడు రెట్ల వృద్ధి నమోదైంది.

FADA అధ్యక్షుడు సాయి గిరిధర్ మాట్లాడుతూ.. ఆగస్టు 2026 భారత EV రంగానికి అత్యంత కీలకమైన నెలగా నిలిచిందని పేర్కొన్నారు. నాలుగు ప్రధాన EV విభాగాలు ఆగస్టులో సరికొత్త రికార్డులను నమోదు చేశాయని తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలకు ఆగస్టు అత్యుత్తమ నెలగా నిలిచిందని, అమ్మకాలు 4,702 యూనిట్ల గరిష్టాన్ని తాకాయని చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story