Electric Cars : ఈవీ మార్కెట్‌లోకి మారుతి, హ్యుందాయ్ కొత్త కార్లు.. 2026లో లాంచ్‌కు కంపెనీల భారీ ప్లాన్
Electric Cars : భారత ఈవీ మార్కెట్లో సరికొత్త పోరుకు తెరలేవనుంది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతి సుజుకి, హ్యుందాయ్ సంస్థలు 2026లో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
Electric Cars
Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఇంధన ధరల భారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ హితం వైపు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని రెండు అతిపెద్ద ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ సంస్థలు భారత ఈవీ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి సరికొత్త వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఈ రెండు కంపెనీలు తమ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ కార్లను 2026లో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా వీటి లాంచ్ తేదీలను ప్రకటించనప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2026 చివరి నాటికి ఇవి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. మారుతి సుజుకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని తయారు చేస్తుండగా, హ్యుందాయ్ సరికొత్త మైక్రో ఈవీ ఎస్‌యూవీతో మార్కెట్ లీడర్ టాటా మోటార్స్‌కు సవాల్ విసరడానికి రెడీ అవుతోంది.
మారుతి సుజుకి నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ
భారతీయ కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా కార్లను రూపొందించడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ కారును YMC అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తోంది. ఈ కారును మారుతి తన త్వరలో రాబోయే ఇవిటారా ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్‌పైనే నిర్మిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని 2026 చివరలో ప్రదర్శించి, 2027 ప్రారంభం నుంచి విక్రయాలు జరపాలని కంపెనీ భావిస్తోంది. టెస్టింగ్ సమయంలో లీకైన చిత్రాల ప్రకారం.. ఈ కారు బాక్సీ స్టైల్ డిజైన్‌తో, ఎత్తైన ఫ్రంట్ ప్రొఫైల్, పెద్ద హెడ్‌ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది.
ఒక్క చార్జ్‌తో 543 కిలోమీటర్ల రేంజ్
ఈ అప్‌కమింగ్ మారుతి ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ పవర్‌ట్రెయిన్, బ్యాటరీ విషయానికి వస్తే, ఇది ఇవిటారా ఈవీ తరహాలోనే శక్తివంతమైన బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. కస్టమర్ల కోసం 49kWh, 61kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. ఈ కార్లలోని పెద్ద బ్యాటరీ వెర్షన్ ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. సుదూర ప్రయాణాలు చేసే భారతీయ కుటుంబాలకు ఈ రేంజ్ పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. నమ్మకమైన రేంజ్, అదనపు సీటింగ్ కెపాసిటీతో వచ్చే ఈ కారు ఈవీ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుంది.
టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీగా హ్యుందాయ్ మైక్రో ఈవీ
మరోవైపు హ్యుందాయ్ ఇండియా సైతం భారత మధ్యతరగతి ఈవీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ప్లాన్ వేసింది. ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ కారుకు గట్టి పోటీ ఇచ్చేందుకు HE1i అనే కోడ్‌నేమ్‌తో ఒక చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఇది హ్యుందాయ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కారు కానుంది. ఈ కొత్త ఈవీని హ్యుందాయ్ గ్లోబల్ ఈ-జీఎమ్‌పీ ప్లాట్‌ఫారమ్‌పై పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నారు. భారతీయ రోడ్లు, ఇక్కడి కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మార్పులతో ఈ కారును డిజైన్ చేస్తున్నారు.
అడ్వాన్స్‌డ్ లెవెల్-2 ADAS ఫీచర్లు
హ్యుందాయ్ రాబోయే ఈ మైక్రో ఈవీ ఎస్‌యూవీలో కూడా కస్టమర్ల కోసం రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో స్టాండర్డ్ రేంజ్ కోసం ఒక బ్యాటరీ, లాంగ్ రేంజ్ కోసం మరో బ్యాటరీ వెర్షన్లు ఉంటాయి. నివేదికల ప్రకారం.. ఇందులో 42kWh, 49kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లను అమర్చే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికొస్తే హ్యుందాయ్ ఎప్పుడూ రాజీ పడదు. ఈ చిన్న కారులో కూడా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఓటీఏ అప్‌డేట్స్ సపోర్ట్, డ్రైవర్ భద్రత కోసం అధునాతన లెవెల్-2 ఏడీఏఎస్ వంటి లగ్జరీ ఫీచర్లను అందించనున్నారు. మొత్తానికి 2026లో రాబోయే మారుతి, హ్యుందాయ్ కార్లు భారత ఈవీ రంగంలో పోటీని మరింత రసవత్తరంగా మార్చనున్నాయి.




