పెట్రోల్ లేదు, డీజిల్ లేదు..! గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్ కార్ తయారు చేసిన భారతీయుడు..!
Electric Flying Car: రవి టమ్టా సాధించిన ఈ విజయం భారతీయ స్టార్టప్‌ల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, కొండ ప్రాంతాల ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఉంది.
పెట్రోల్ లేదు, డీజిల్ లేదు..! గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్ కార్ తయారు చేసిన భారతీయుడు..!
Electric Flying Car: ట్రాఫిక్ కష్టాలకు, కొండ ప్రాంతాల ప్రయాణాలకు చరమగీతం పాడుతూ ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సాధారణ యువకుడు అద్భుతమే సృష్టించాడు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా పూర్తిగా విద్యుత్‌తో గాల్లో ఎగిరే స్వేదేశీ రవాణా వాహనాన్ని తయారు చేసి రికార్డు సృష్టించాడు. ఈ సాంకేతికత ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరా జిల్లా, కాఫ్లీఖాన్ గ్రామానికి చెందిన రవి టమ్టా అనే యువకుడు ఈ అసాధారణ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. తన సొంత స్టార్టప్ 'హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా HAPIDA SKYNeX పేరిట ఒక పర్సనల్ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ వెహికల్‌ను అభివృద్ధి చేశాడు. కొన్నేళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించి, రీసెర్చ్ చేసి రూపొందించిన ఈ ప్రొటోటైప్ ట్రయల్స్ ఇటీవల విజయవంతంగా పూర్తయ్యాయి. వ్యక్తిగత వైమానిక ప్రయాణ కల నిజమయ్యే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయని ఈ ప్రయోగం నిరూపించింది.
పర్యావరణానికి ఏమాత్రం హాని లేని టెక్నాలజీ..
సాధారణంగా విమానాలు లేదా హెలికాప్టర్లు నడవాలంటే అత్యంత ఖరీదైన ఏవియేషన్ ఫ్యూయల్ కావాలి. కొన్ని వాహనాలు ఇథనాల్ ఇంధనంతో నడుస్తాయి. అయితే రవి టమ్టా తయారు చేసిన ఈ ఫ్లైయింగ్ కార్ పూర్తిగా బ్యాటరీ శక్తితో పనిచేస్తుంది. జీరో పర్సెంట్ ఉద్గారాలు విడుదల చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. కొండ ప్రాంతాల్లోని కఠినమైన రహదారులు, నిత్యం వేధించే ట్రాఫిక్ జామ్‌లను సులువుగా దాటుకుని ఇది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ ఘనత సాధించిన రవి టమ్టాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు.
అత్యవసర సమయాల్లో ప్రాణదాతగా..
భారత్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా, సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రైవేట్ వైమానిక ప్రయాణాన్ని అందించడమే తన లక్ష్యమని రవి పేర్కొన్నాడు. ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే కొండ ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే విపత్తుల సమయంలో సహాయక చర్యలు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగుపడటమే కాకుండా, పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
వాణిజ్య వినియోగానికి సిద్ధమవుతున్న వాహనం..
ప్రస్తుతం ఈ ఫ్లైయింగ్ కార్ ప్రొటోటైప్ దశలోనే విజయవంతమైంది. భవిష్యత్తులో దీనిని రోడ్లపై, ఆకాశంలో సాధారణ ప్రజల వినియోగానికి తీసుకురావడానికి ముందు మరిన్ని విస్తృత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వంటి అధికారిక సంస్థల నుంచి నిబంధనల ప్రకారం అనుమతులు లభించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే భారతీయ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
రవి టమ్టా సాధించిన ఈ విజయం భారతీయ స్టార్టప్‌ల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, కొండ ప్రాంతాల ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఉంది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే అతి త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్లు మన ఆకాశంలో విహరించడం ఖాయం.




