Future Car Technology India: పెట్రోల్, బ్యాటరీనా లేక మరేదైనా.. భవిష్యత్తులో మన కార్లు ఏ టెక్నాలజీతో నడుస్తాయి..?

Future Car Technology India: దేశీయ ఆటోమొబైల్ విపణిలో విద్యుత్ వాహనాల (ఈవీ) హవా పెరుగుతున్నప్పటికీ, అధిక ధరలు, 'రేంజ్ భయం' కారణంగా పూర్తిస్థాయి ఈవీలను కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఇంకా వెనుకాడుతున్నారు.

Venkat
Published on: 24 July 2026 12:01 PM IST
Future Car Technology India
X

Future Car Technology India: పెట్రోల్, బ్యాటరీనా లేక మరేదైనా.. భవిష్యత్తులో మన కార్లు ఏ టెక్నాలజీతో నడుస్తాయి..?

Future Car Technology India: భారత మార్కెట్లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందుతున్నది 'స్ట్రాంగ్ హైబ్రిడ్' సాంకేతికత. ఈ రకం కార్లలో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటారు, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఈ బ్యాటరీని మనం విడిగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.కారు వెళ్తున్నప్పుడు బ్రేకులు వేసినప్పుడు లేదా ఇంజిన్ నడుస్తున్నప్పుడు బ్యాటరీ దానంతట అదే ఛార్జ్ అవుతుంది. తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు కారు విద్యుత్ మోడ్‌లోనే నడుస్తుంది. అయితే, ప్యూర్ ఈవీ మోడ్‌లో ఈ కార్లు కేవలం 3 నుంచి 4 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలవు. మార్కెట్‌లో లభించే టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ఈ విభాగానికి చెందినవే.

100 కిలోమీటర్ల ఈవీ రేంజ్ ఇచ్చే 'ప్లగ్-ఇన్ హైబ్రిడ్'..!

త్వరలోనే సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్న మరో అద్భుత సాంకేతికత 'ప్లగ్-ఇన్ హైబ్రిడ్' (PHEV). స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లతో పోలిస్తే వీటిలో పెద్ద సైజ్ బ్యాటరీని అమరుస్తారు. ఈ బ్యాటరీని విడిగా ప్లగ్ పాయింట్ ద్వారా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కార్లు సులభంగా 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పూర్తిగా విద్యుత్ శక్తితోనే ప్రయాణిస్తాయి. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా పెట్రోల్ ఇంజిన్‌పైకి మారుతాయి. రోజువారీ నగర ప్రయాణాలకు విద్యుత్, సుదూర ప్రాంతాలకు పెట్రోల్ వాడుకోవాలనుకునే వారికి ఇది ఒక సరైన ఎంపికగా నిలవనుంది.

రేంజ్ భయానికి చరమగీతం పాడే 'రేంజ్ ఎక్స్టెండర్ ఈవీ'..!

కారు ప్రయాణంలో మధ్యలో ఎక్కడ బ్యాటరీ అయిపోతుందోనన్న భయానికి ముగింపు పలికే సరికొత్త సాంకేతికతే 'రేంజ్ ఎక్స్టెండర్ ఎలక్ట్రిక్ వెహికల్' (REEV). ఇది ప్రాథమికంగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారే అయినప్పటికీ, ఇందులో ఒక చిన్న పెట్రోల్ ఇంజిన్‌ను జతచేస్తారు. కానీ, ఈ పెట్రోల్ ఇంజిన్ నేరుగా కారు చక్రాలను తిప్పదు. కేవలం కారులోని జనరేటర్‌ను నడిపి బ్యాటరీని ఛార్జ్ చేయడం మాత్రమే దీని పని. అంటే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిన వెంటనే ఈ పెట్రోల్ ఇంజిన్ స్టార్ట్ అయి బ్యాటరీని స్వయంచాలకంగా ఛార్జ్ చేస్తుంది.

భారతీయ మార్కెట్‌కు ఏ సాంకేతికత అత్యంత అనుకూలం..?

మన దేశంలో మెజారిటీ కుటుంబాలు ఒకే కారును వినియోగిస్తుంటాయి. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడానికి నగరాల్లో ఈవీ, సెలవుల్లో దూర ప్రయాణాల కోసం పెట్రోల్ కారు వేర్వేరుగా కొనడం అందరికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రేంజ్ ఎక్స్టెండర్ కార్లు అత్యంత చవకగా లభించే అవకాశం ఉంది. ఇందులో చిన్న బ్యాటరీ సరిపోతుంది. కాబట్టి కారు తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో ఈ రేంజ్ ఎక్స్టెండర్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లు భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించడం ఖాయంగా కనిపిస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story