
Mahindra Vision S
Concept Cars : భవిష్యత్తు ఆటోమొబైల్ ట్రెండ్స్‌ను ప్రతిబింబించే ఫ్రీల్యాండర్, హ్యుందాయ్ బోల్డర్, రెనాల్ట్ బ్రిడ్జర్ మరియు మహింద్రా విజన్ ఎస్ వంటి కాన్సెప్ట్ ఎస్‌యూవీల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Concept Cars : ఆటోమొబైల్ ప్రపంచంలో ఇప్పుడు కాన్సెప్ట్ కార్ల హవా నడుస్తోంది. భవిష్యత్తులో మనం నడపబోయే కార్లు ఎలా ఉంటాయో ఈ మోడళ్లు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అదిరిపోయే డిజైన్లు, ఊహకందని టెక్నాలజీతో దిగ్గజ కంపెనీలు కొత్త కార్లను పరిచయం చేస్తున్నాయి. కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా, త్వరలోనే రోడ్లపైకి రాబోతున్న కొన్ని పవర్‌ఫుల్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. ఫ్రీల్యాండర్ కాన్సెప్ట్
జగుఆర్ ల్యాండ్ రోవర్ తన ఐకానిక్ బ్రాండ్ ఫ్రీల్యాండర్ను సరికొత్తగా తీసుకువస్తోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత, చైనాకు చెందిన చెరీ కంపెనీతో చేతులు కలిపి దీనిని ఒక ప్రత్యేక ఎలక్ట్రిక్ బ్రాండ్‌గా మారుస్తున్నారు. ఇందులో కాన్సెప్ట్ 97 అనే మోడల్ పాత ఫ్రీల్యాండర్ జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్‌గా కనిపిస్తోంది. దీని డిజైన్ క్లాసిక్ ఫ్రీల్యాండర్, కొత్త డిఫెండర్ల కలయికలా ఉంది. ఇందులో సూసైడ్ డోర్స్, పిక్సలేటెడ్ ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు ప్రత్యేక ఆకర్షణ. లోపల ఆరుగురు కూర్చునేలా మూడు వరుసల సీటింగ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, హువావే ఇంటెలిజెంట్ డ్రైవింగ్ సిస్టమ్ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో ఇలాంటి 6 మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
2. హ్యుందాయ్ బోల్డర్
హ్యుందాయ్ కంపెనీ ఇప్పటివరకు సాఫ్ట్ ఎస్‌యూవీలకే పరిమితమైంది. కానీ, జీప్ రాంగ్లర్, ఫోర్డ్ బ్రాంకో వంటి దిగ్గజాలకు పోటీగా బోల్డర్ కాన్సెప్ట్‌ను 2026 న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించింది. ఇది పక్కా బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్ పై తయారైన రగ్గడ్ కారు. 37-అంగుళాల భారీ మడ్-టెర్రైన్ టైర్లు, ఆకాశమంత గ్రౌండ్ క్లీయరెన్స్, వెనుక వైపు ఫుల్ సైజ్ స్పేర్ వీల్ దీనికి ఒక రగ్గడ్ లుక్‌ని ఇస్తున్నాయి. అడ్వెంచర్ ప్రియుల కోసం హ్యుందాయ్ ఇస్తున్న పక్కా ఆఫ్-రోడ్ గిఫ్ట్ ఇది.
3. రెనాల్ట్ బ్రిడ్జర్
రెనాల్ట్ కంపెనీ మినీ డస్టర్ గా పిలవబడే బ్రిడ్జర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. దీని బాక్సీ డిజైన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను తలపిస్తుంది. చిన్న సైజులో ఉన్నా, దీని ఆఫ్-రోడ్ సామర్థ్యం మాత్రం భారీగానే ఉండబోతోంది. 2027 నాటికి ఇది ప్రొడక్షన్ దశకు చేరుకునే అవకాశం ఉంది. పెట్రోల్, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ ఆప్షన్లలో లభించే ఈ కారు, భారతదేశం వంటి మార్కెట్లలో సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది.
4. మహింద్రా విజన్ ఎస్
మహింద్రా తన విజన్ ఎస్ ఎస్‌యూవీని శరవేగంగా సిద్ధం చేస్తోంది. ఇటీవల దీనిని టెస్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని కీలక వివరాలు బయటపడ్డాయి. ఇది పూర్తిగా బాక్సీ లుక్‌లో, అడ్వెంచర్లకు రెడీగా ఉంది. లోపల పనోరమిక్ సన్‌రూఫ్, భారీ టచ్‌స్క్రీన్, అందరు ప్రయాణికులకు త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మహింద్రా కొత్త NU IQ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire


