టయోటా, మారుతీలకు చెక్..? లీటరుకు 45 కి.మీ మైలేజ్ ఇచ్చే ఏఐ కారు ఆగయా!
Geely AI Car Mileage: చైనాకు చెందిన 'గీలీ ఆటో' (Geely Auto) ఒక అద్భుతమైన హైబ్రిడ్ కారును పరిచయం చేసింది.
టయోటా, మారుతీలకు చెక్..? లీటరుకు 45 కి.మీ మైలేజ్ ఇచ్చే ఏఐ కారు ఆగయా!
Geely AI Car Mileage: చైనీస్ ఆటో దిగ్గజం గీలీ ఆటో (Geely Auto) ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన హైబ్రిడ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. 'i-HEV ఇంటెలిజెంట్ హైబ్రిడ్' పేరుతో పిలిచే ఈ సాంకేతికత, సాంప్రదాయ హైబ్రిడ్ కార్ల ప్రపంచంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు హైబ్రిడ్ విభాగంలో టొయోటా వంటి జపాన్ కంపెనీలదే హవా కొనసాగుతుండగా, గీలీ తన రికార్డు మైలేజ్‌తో వాటికి గట్టి పోటీనిస్తోంది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా కారు కేవలం పెట్రోల్‌పైనే కాకుండా, అత్యంత సమర్థవంతంగా విద్యుత్ శక్తిని కూడా ఉపయోగించుకుంటుంది.
రికార్డు బ్రేకింగ్ మైలేజ్: రూ. 3000లకే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు..!
గీలీ సంస్థ తన 'ఎమ్ గ్రాండ్' (Emgrand) మోడల్‌లో ఈ కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌ను పరీక్షించింది. ఈ పరీక్షల్లో కారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కేవలం 2.22 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే వినియోగించుకుంది. అంటే లీటరుకు దాదాపు 45 కిలోమీటర్ల మైలేజ్ అన్నమాట. ఈ ఘనత ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో కూడా చోటు సంపాదించుకుంది.
ప్రస్తుత పెట్రోల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, హైదరాబాద్ నుంచి ఢిల్లీ (సుమారు 1500 కి.మీ) మధ్య ప్రయాణానికి కేవలం రూ. 3000 నుంచి రూ. 3500 మాత్రమే ఖర్చవుతుంది. సాధారణ కార్లతో పోలిస్తే ఇది సగానికంటే తక్కువ ఖర్చు కావడం విశేషం. సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా సుదీర్ఘ ప్రయాణాలు చేసేందుకు ఈ టెక్నాలజీ వరంగా మారనుంది.
AI టెక్నాలజీతో స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్..
గీలీ i-HEV సిస్టమ్ కేవలం మైలేజ్ మాత్రమే కాదు, మేధస్సులోనూ ముందుంది. ఇందులో అమర్చిన AI ఆధారిత ఎనర్జీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ రియల్ టైమ్‌లో వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, రోడ్డు ఎత్తుపల్లాలు (Altitude) వంటి అంశాలను విశ్లేషిస్తుంది. ఈ డేటా ఆధారంగా ఇంజిన్, బ్యాటరీ మధ్య శక్తి వినియోగాన్ని AI సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల ఏ పరిస్థితుల్లోనైనా కారు గరిష్ట పనితీరును, అత్యుత్తమ మైలేజ్‌ను అందిస్తుంది. అదనంగా, ఇందులో ఉన్న హై-కంప్యూటింగ్ పవర్ అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్లను (ADAS) కూడా సపోర్ట్ చేస్తుంది.
జపాన్ కంపెనీలకు సవాల్: టొయోటా, మారుతిలకు కష్టకాలమేనా?
హైబ్రిడ్ కార్ల విభాగంలో 1997లో టొయోటా ప్రియస్ (Toyota Prius) లాంచ్ అయినప్పటి నుంచి జపాన్ కంపెనీలదే పైచేయిగా ఉంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్న చోట హైబ్రిడ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది.
అయితే, గీలీ తీసుకొచ్చిన ఈ కొత్త టెక్నాలజీ జపాన్ కంపెనీల ఆధిపత్యాన్ని దెబ్బతీసేలా కనిపిస్తోంది. షాంఘైకి చెందిన ఆటోమోటివ్ ఫోర్‌సైట్ మేనేజింగ్ డైరెక్టర్ యేల్ జాంగ్ అభిప్రాయం ప్రకారం.. గీలీ సిస్టమ్ శక్తివంతమైన మోటార్, తక్కువ ఇంధన వినియోగం, మెరుగైన AI ఫీచర్లతో వస్తోంది. ఇది టొయోటా, మారుతి సుజుకి వంటి కంపెనీలకు నేరుగా సవాల్ విసిరినట్లే.
మార్కెట్లోకి ఎప్పుడు రానుంది?
గీలీ ఆటో ఈ సరికొత్త i-HEV టెక్నాలజీని 2026 నాటికి తన ప్రధాన మోడల్స్ అయిన ప్రిఫేస్ (Preface), మోంజారో (Monjaro), స్టారే (Starray), ఎమ్ గ్రాండ్ (Emgrand) కార్లలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు ఆసియా దేశాల్లో ఈ కార్లు విపరీతమైన ఆదరణ పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇటువంటి మైలేజ్ ఇచ్చే కార్ల కోసం వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




