Ethanol Bike : జూన్ 3న కొత్త చరిత్ర.! భారత్‌లోనే మొదటి 100% ఇథనాల్ బైక్..!

Ethanol Bike : భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల రంగంలో సరికొత్త విప్లవానికి హీరో మోటోకార్ప్ తెరలేపబోతోంది. దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్..

G Krishna
Published on: 29 May 2026 11:10 AM IST
Ethanol Bike
X

Ethanol Bike

Ethanol Bike : భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల రంగంలో సరికొత్త విప్లవానికి హీరో మోటోకార్ప్ తెరలేపబోతోంది. దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. జూన్ 3న దిల్లీలో జరగబోయే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అలాగే పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమక్షంలో ఈ సరికొత్త బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే ముడి చమురు భారాన్ని తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా హీరో సంస్థ ఈ కీలక అడుగు వేసింది.

స్ప్లెండర్ , హెచ్ఎఫ్ డీలక్స్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త ప్రయోగం

హీరో మోటోకార్ప్ ఈ రాబోయే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ పేరును అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ, మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన 'స్ప్లెండర్' (Splendor), 'హెచ్ఎఫ్ డీలక్స్' (HF Deluxe) కమ్యూటర్ ప్లాట్‌ఫామ్‌లపైనే ఇది ఆధారపడి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో లోనే హీరో సంస్థ హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వర్షన్‌ను ప్రదర్శించి, ఇథనాల్ మొబిలిటీపై తనకున్న ప్లాన్స్‌ను ముందే హింట్ ఇచ్చింది. ఒకవేళ దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ఈ మిడ్-రెంజ్ ప్లాట్‌ఫామ్‌లపై కనుక ఈ ఇథనాల్ బైక్ వస్తే, హీరో మోటోకార్ప్‌కు ఉన్న విస్తృతమైన కస్టమర్ బేస్ , గ్రామీణ మార్కెట్ నెట్‌వర్క్ కారణంగా ఇది సామాన్యులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

అసలు ఏమిటీ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ.?

సాధారణ వాహనాల్లా కాకుండా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్ , ఇథనాల్‌తో కూడిన విభిన్న మిశ్రమ ఇంధనాలతో నడవగలవు. ప్రస్తుతం భారతదేశంలో లభిస్తున్న చాలా పెట్రోల్ వాహనాలు 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన 'E20' ఇంధనానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయితే, హీరో తీసుకురాబోయే ఈ కొత్త మోటార్ సైకిల్ ఏకంగా 100 శాతం ఇథనాల్ (E100) తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. దీనివల్ల ఇంధన ఖర్చులు భారీగా తగ్గడమే కాకుండా, వాహనాల నుండి వచ్చే ఉద్గారాలు (కాలుష్యం) కూడా గణనీయంగా తగ్గుతాయి.

మార్కెట్లో పోటీ , హీరో సరికొత్త వ్యూహం

ప్రస్తుతానికి భారత టూ-వీలర్ మార్కెట్లో ఫ్లెక్స్-ఫ్యూయల్ విభాగం చాలా ప్రాథమిక దశలోనే ఉంది. సుజుకి సంస్థ E85 ఇంధనంతో నడిచే 'సుజుకి జిక్సర్ SF 250' బైక్‌ను అందిస్తుండగా, హోండా కంపెనీ గతంలో తెచ్చిన 'CB300F' ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను కొన్ని కారణాల వల్ల మార్కెట్ నుండి నిలిపివేసింది. ఈ తరుణంలో సామాన్యుల బడ్జెట్ విభాగంలో 100% ఇథనాల్ బైక్‌ను పరిచయం చేయడం ద్వారా హీరో మోటోకార్ప్ ఈ సెగ్మెంట్‌లో రారాజుగా మారాలని చూస్తోంది. ఈ ఆవిష్కరణను కంపెనీ "స్థిరమైన మొబిలిటీలో తదుపరి అధ్యాయం"గా అభివర్ణించింది. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోతో పాటు, ఈ గ్రీన్ టెక్నాలజీ వైపు అడుగులు వేయడం ద్వారా భవిష్యత్తు రవాణా రంగాన్ని మార్చడానికి హీరో సిద్ధమవుతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story