Hero: అదిరిపోయే లుక్స్.. అధునాతన బ్రేకింగ్ సిస్టమ్.. బైక్ లవర్లను ఆకట్టుకుంటున్న హీరో కొత్త మోడల్

Hero: దేశీయ టూ వీలర్ తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 125 సీసీ విభాగంలో సరికొత్త గ్లామర్ X 125 బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

CR Reddy
Published on: 12 Sept 2026 10:20 AM IST
Hero Glamour
X

Hero Glamour

Hero: దేశీయ టూ వీలర్ తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 125 సీసీ విభాగంలో సరికొత్త గ్లామర్ X 125 బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధర రూ.1.01 లక్షలుగా నిర్ణయించారు. ఈ విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా క్రూయిజ్ కంట్రోల్, అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్‌తో ఈ వాహనం దూసుకొచ్చింది. కొత్త హీరో గ్లామర్ X 125 మోడల్‌లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ 125 సీసీ విభాగంలోనే తొలిసారిగా సింగిల్-ఛానల్ ఏబీఎస్ (ABS) కాంబినేషన్‌తో కూడిన ఇంటెగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS) పరిచయం చేశారు. ఆకస్మికంగా తీవ్రమైన బ్రేక్ వేసిన సందర్భాలలో ముందు చక్రం లాక్ కాకుండా ఈ ఏబీఎస్ టెక్నాలజీ కాపాడుతుంది. ఆ సమయంలో ఐబీఎస్ వెనుక, ముందు బ్రేకులను ఏకకాలంలో సమన్వయం చేస్తూ ప్రయాణాన్ని సురక్షితంగా మారుస్తుంది.

పవర్ఫుల్ ఇంజిన్.. క్రూయిజ్ కంట్రోల్ ప్రత్యేకత

పర్ఫార్మెన్స్ విషయంలో ఈ బైక్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇందులో 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,250 ఆర్‌పీఎమ్ వద్ద 11.4 బీహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణించేందుకు ఈ విభాగంలో తొలిసారిగా ఈకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందించారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి అలసట లేకుండా సులువుగా ప్రయాణించడానికి వీలుగా 'క్రూయిజ్ కంట్రోల్' ఫీచర్‌ను కూడా పొందుపరిచారు.

సాంకేతిక మెరుగులు.. డిజిటల్ ఫీచర్లు

ఆధునిక యువతను ఆకట్టుకునేలా వాహనాన్ని సరికొత్త డిజిటల్ టెక్నాలజీతో తీర్చిదిద్దారు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్ అందించే బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న కలర్ టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లే ఇందులో లభిస్తుంది. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, సీటు కింద రెండు ఫోన్లు పెట్టుకునే నిల్వ స్థలం ఇచ్చారు. పూర్తి స్థాయి ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌తో రాత్రి వేళల్లో మెరుగైన కాంతి లభిస్తుంది.

వివిధ కలర్ ఆప్షన్లు

రూపకల్పన శైలి చూస్తే గన్ మెటల్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే, బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ టీల్ బ్లూ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ మోడల్ లభిస్తుంది. ప్రీమియం బైకులలో మాత్రమే ఉండే బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్ లాంటి విశేషాలను రూ. 1.01 లక్షల ప్రారంభ ధరలోనే అందించడం వల్ల రోజువారీ ప్రయాణికులకు ఇది చక్కటి ఎంపికగా నిలవనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.