Hero HF Deluxe: లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్.. అయినా ఛీ కొడుతోన్న జనాలు.. ఇంత అట్టర్ ఫ్లాప్ బైక్ ఏంటో తెలుసా?

Hero HF Deluxe: మధ్యతరగతి ప్రజల నమ్మకమైన వాహనంగా పేరుగాంచిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ అమ్మకాలు ఒక్కసారిగా కుప్పకూలడం ఆటోమొబైల్ రంగాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.

Venkat
Updated on: 21 Jun 2026 9:58 PM IST
Hero HF Deluxe
X

Hero HF Deluxe: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ సంస్థకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు

Hero HF Deluxe: మధ్యతరగతి ప్రజల నమ్మకమైన వాహనంగా పేరుగాంచిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ అమ్మకాలు ఒక్కసారిగా కుప్పకూలడం ఆటోమొబైల్ రంగాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. లీటరుకు ఏకంగా 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నప్పటికీ, 2026 మే నెలలో ఈ బైక్ విక్రయాలు ఏకంగా 38 శాతానికి పైగా భారీ క్షీణతను నమోదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నమ్మకమైన బ్రాండ్‌కు తగిలిన ఊహించని ఎదురుదెబ్బ..

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ సంస్థకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్, ఎక్కువ మైలేజ్ కోరుకునే సాధారణ సామాన్యుడికి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎప్పటి నుంచో మొదటి ఎంపికగా నిలుస్తూ వస్తోంది. అత్యంత తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన ఈ మోడల్ అమ్మకాల పరంగా ఎప్పుడూ రికార్డులు సృష్టించేది. కానీ, ఇటీవల విడుదలైన మే నెల అమ్మకాల గణాంకాలు చూస్తుంటే ఈ బైక్ వైభవం మెల్లగా తగ్గుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడైన ఈ బైక్‌ను కొనడానికి కస్టమర్లు ఇప్పుడు అంతగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది.

గణాంకాలు చెబుతున్న చేదు నిజం..

గత ఏడాది అమ్మకాలతో పోల్చి చూస్తే ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 2025 మే నెలలో హీరో మోటోకార్ప్ సంస్థ దేశవ్యాప్తంగా మొత్తం 1,07,768 యూనిట్ల హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లను విజయవంతంగా విక్రయించింది. అయితే,

కట్ చేస్తే 2026 మే నెల నాటికి ఈ విక్రయాల సంఖ్య ఘోరంగా పడిపోయి కేవలం 66,722 యూనిట్లకే పరిమితమైంది. అంటే కేవలం ఒకే ఒక్క ఏడాది వ్యవధిలోనే ఏకంగా 41,046 బైక్‌ల అమ్మకాలు తగ్గిపోయాయి. శాతం పరంగా లెక్కగడితే వార్షిక విక్రయాలలో సుమారు 38.09 శాతం మేర భారీ క్షీణత నమోదైంది. ఇంతటి నమ్మకమైన మోడల్ ఈ స్థాయిలో వెనుకబడిపోవడం ఆటోమొబైల్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

మైలేజ్ ఉన్నా కస్టమర్లు ఎందుకు ముఖం చాటేస్తున్నారు?

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లో సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేవు. ఇందులో అమర్చిన నమ్మకమైన ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.91 బిహెచ్‌పి శక్తిని, అలాగే 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తుంది.

నగరాల్లోని ట్రాఫిక్ రోడ్లపై, గ్రామీణ ప్రాంతాల్లోని కఠినమైన దారుల్లోనూ ప్రయాణించడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించేలా లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నప్పటికీ కస్టమర్లు దీనిపై మొగ్గు చూపకపోవడానికి ప్రధాన కారణం మారుతున్న యువత అభిరుచులే.

ప్రస్తుత రోజుల్లో సాధారణ మైలేజ్ బైక్‌ల కంటే కూడా ఎక్కువ ఫీచర్లు, స్టైలిష్ లుక్, ఆధునిక సాంకేతికత కలిగిన సరికొత్త మోడళ్ల వైపు కస్టమర్లు, ముఖ్యంగా యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో వస్తున్న ఇతర బైక్‌ల పోటీని తట్టుకోవడంలో హెచ్‌ఎఫ్ డీలక్స్ కొంత వెనుకబడినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆశలు కోల్పోని హీరో మోటోకార్ప్..

అమ్మకాలు భారీగా తగ్గినప్పటికీ, హీరో మోటోకార్ప్ యాజమాన్యం మాత్రం ఈ మోడల్‌పై గట్టి నమ్మకంతోనే ఉంది. గ్రామీణ భారతంలో ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ ఇంకా పూర్తిగా తగ్గిపోలేదని సంస్థ భావిస్తోంది. రాబోయే పండుగల సీజన్ నాటికి సరికొత్త ఆఫర్లు, వ్యూహాలతో కస్టమర్లను ఆకట్టుకుని, హెచ్‌ఎఫ్ డీలక్స్ అమ్మకాలను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురాగలమని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాలంతో పాటు వినియోగదారుల ప్రాధాన్యతలు మారడం సహజం. కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా లుక్స్, డిజిటల్ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్న నేటి తరాన్ని ఆకట్టుకోవాలంటే హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడల్‌లో కూడా కాలానికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ మే నెల అమ్మకాల పతనం స్పష్టం చేస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story