Hero Flex Fuel Bikes : చుక్క పెట్రోల్ అవసరం లేదు.. భారత మార్కెట్లోకి హీరో కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులు

Hero Flex Fuel Bikes : హీరో మోటోకార్ప్ భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఆధారిత స్ప్లెండర్+, హెచ్ఎఫ్ డీలక్స్ బైకులను లాంచ్ చేసింది. ఎథనాల్ ఇంధనంతో నడిచే ఈ బైకుల ప్రారంభ ధర రూ.72,792గా ఉంది.

CR Reddy
Published on: 4 Jun 2026 8:36 AM IST
Hero Flex Fuel Bikes
X

Hero Flex Fuel Bikes

Hero Flex Fuel Bikes : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త మైలేజ్ విప్లవాన్ని తీసుకువచ్చింది. దేశంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన తమ కమ్యూటర్ మోటార్ సైకిళ్లు స్ప్లెండర్ ప్లస్ (Splendor+), హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe)లలో ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) వేరియంట్లను అధికారికంగా లాంచ్ చేసింది. పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా హీరో ఈ సరికొత్త బైకులను డిజైన్ చేసింది.

ధరల విషయానికి వస్తే.. ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం సరికొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ధరను రూ.72,792లుగా నిర్ణయించగా, స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ధరను రూ.82,710లుగా ఖరారు చేశారు. ఈ రెండు మోటార్ సైకిళ్లు రాబోయే జూలై నెల నుంచి ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో విక్రయానికి రానున్నాయి. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా ఉన్న మిగతా మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ ప్రకటించింది.

సాధారణంగా ఏదైనా కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తే.. కంపెనీలు మొదటగా ఎక్కువ ధర ఉండే ప్రీమియం బైకులలో లేదా తక్కువగా అమ్ముడయ్యే మోడళ్లలో ప్రవేశపెడతాయి. కానీ హీరో మోటోకార్ప్ ఇందుకు భిన్నంగా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. భారతదేశంలో ప్రతి నెలా లక్షల సంఖ్యలో అమ్ముడయ్యే స్ప్లెండర్, హెచ్ఎఫ్ సిరీస్ బైకుల్లోనే నేరుగా ఈ టెక్నాలజీని పరిచయం చేసింది. దేశంలో అమ్ముడయ్యే మొత్తం బైకులలో ఈ రెండు మోడళ్ల వాటానే దాదాపు మూడో వంతు ఉంటుంది. దీనివల్ల ఎథనాల్ ఫ్యూయెల్ టెక్నాలజీ సామాన్య ప్రజలకు సైతం చాలా వేగంగా చేరువవుతుందని హీరో భావిస్తోంది.

ఈ రెండు బైకులలోనూ పాత కాలపు నమ్మకమైన 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించినప్పటికీ, ఫ్లెక్స్-ఫ్యూయల్‌కు సపోర్ట్ చేసేలా దాన్ని పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. ఇవి E20 (20% ఎథనాల్) నుంచి E85 (85% ఎథనాల్) బ్లెండెడ్ ఇంధనంతో నడుస్తాయి. ఈ బైకులలోని ప్రత్యేకమైన సెన్సార్ టెక్నాలజీ ఇంధనంలో ఉన్న ఎథనాల్ శాతాన్ని స్వయంగా గుర్తించి, దానికి తగినట్లుగా ఇంజన్ పనితీరును ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. ఇది గరిష్ఠంగా E100 (100% ఎథనాల్) ఇంధనాన్ని కూడా తట్టుకోగలదు. E85 ఇంధనంపై నడుస్తున్నప్పుడు ఈ ఇంజన్ 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 8.4 హెచ్‌పీ పవర్‌ను, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 8.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికోసం కంపెనీ ఈసీయూ, ఫ్యూయల్ సిస్టమ్ భాగాలను మార్చింది.

కొత్త ఇంధన హార్డ్‌వేర్‌తో పాటు సరికొత్త డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఈ బైకులలో అమర్చారు. ఇవి మినహా బైక్ మెకానికల్, డిజైన్ పరంగా ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. రైడర్ సేఫ్టీ కోసం సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫంక్షన్, ట్యూబ్‌లెస్ టైర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. స్ప్లెండర్+ మోడల్‌లో హీరో పేటెంట్ ఐ3ఎస్ (i3S) ఐడల్ స్టాప్-స్టార్ట్ టెక్నాలజీని అలాగే కొనసాగించారు. హెచ్ఎఫ్ డీలక్స్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్, 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లతో కూడిన ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. స్ప్లెండర్+ కూడా అల్లాయ్ వీల్స్, 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్‌తో పాత నమ్మకాన్ని నిలబెట్టుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story