73 కిలోమీటర్ల మైలేజీతో దుమ్మురేపుతున్న బైక్.. అమ్మకాల్లోనూ తగ్గేదేలే.. ధర, ఫీచర్లు ఇవే..?
Hero Splendor Plus Mileage: భారతీయ రోడ్లపై తిరుగులేని రారాజుగా హీరో స్ప్లెండర్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.
Hero Splendor Plus Mileage
Hero Splendor Plus Mileage: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్ ఏది అంటే ఎవరైనా చెప్పే ఏకైక పేరు 'హీరో స్ప్లెండర్'. సామాన్యుడి బడ్జెట్‌కు తగిన ధర, లీటరు పెట్రోలుకు ఇచ్చే అద్భుతమైన మైలేజీ ఈ బైక్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. కేవలం రవాణా సాధనంగానే కాకుండా, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ఈ సిరీస్ బైకులు ప్రస్తుతం మార్కెట్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే, హీరో స్ప్లెండర్ సిరీస్ మొత్తం 3,21,952 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 2,07,763 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 55 శాతం అదనపు వృద్ధిని నమోదు చేసింది.
అమ్మకాల గణాంకాలు, మార్కెట్ ట్రెండ్..
గత ఆరు నెలలుగా హీరో స్ప్లెండర్ అమ్మకాలు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. 2025 సెప్టెంబర్‌లో 3.63 లక్షల యూనిట్లు, అక్టోబర్‌లో 3.40 లక్షలు, నవంబర్‌లో 3.48 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కూడా 3.10 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. అంటే ప్రతి నెలా సగటున 3 లక్షల మంది భారతీయులు ఈ బైక్‌ను ఎంచుకుంటున్నారని అర్థమవుతోంది. తక్కువ నిర్వహణ ఖర్చు, మెరుగైన రీసేల్ విలువ ఉండటమే దీనికి ప్రధాన కారణం.
వివిధ మోడళ్ల ధరలు, ప్రత్యేకతలు..
హీరో మోటోకార్ప్ ప్రస్తుతం స్ప్లెండర్ సిరీస్‌లో మూడు ప్రధాన వేరియంట్లను అందుబాటులో ఉంచింది:
హీరో స్ప్లెండర్ ప్లస్: దీని ప్రారంభ ధర సుమారు రూ. 74,902 (ఎక్స్-షోరూమ్). ఇందులో 97.2 సిసి ఇంజన్ ఉంటుంది. ఇది 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని బరువు కేవలం 112 కిలోలు మాత్రమే.
హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్: ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ మోడల్ ధర రూ. 78,428 నుంచి ప్రారంభమవుతుంది. ఇది లీటరుకు ఏకంగా 73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండటం గమనార్హం.
హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్: కొంచెం ఎక్కువ శక్తి కావాలనుకునే వారి కోసం 124.7 సిసి ఇంజన్‌తో ఈ బైక్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 83,448 గా ఉంది. ఇది లీటరుకు 69 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూస్తున్న వారికి హీరో స్ప్లెండర్ ఇప్పటికీ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.




