Honda Dio: విదేశాల్లో హోండా డియో సంచలనం.. 1.23 లక్షల ఎగుమతులతో రికార్డు

భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న స్కూటర్లలో హోండా డియో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. 1.23 లక్షలకు పైగా ఎగుమతులతో యాక్టివాను వెనక్కి నెట్టింది.

CR Reddy
Published on: 31 Oct 2026 11:37 AM IST
Honda Dio
X

Honda Dio

Honda Dio: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలిగిన హోండా యాక్టివా విదేశీ మార్కెట్లలో మాత్రం వెనుకబడింది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్‌గా చరిత్ర సృష్టించిన యాక్టివాను దాటుకుని విదేశీ ఎగుమతుల్లో హోండా డియో సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2027 మొదటి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో ఎగుమతైన స్కూటర్ల గణాంకాలను పరిశీలిస్తే విదేశీయుల మొదటి ఛాయిస్‌గా హోండా డియో నిలిచింది. ఈ సమయంలో డియో ఏకంగా 1.23 లక్షలకు పైగా యూనిట్ల ఎగుమతులను నమోదు చేసింది.

యాక్టివాను వెనక్కి నెట్టిన డియో జోరు

ఇండియన్ మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న హోండా యాక్టివా విదేశాలకు కేవలం 10,659 యూనిట్లు మాత్రమే ఎగుమతి కావడం విశేషం. ఇదే సమయంలో 1,23,104 యూనిట్లు ఎగుమతైన హోండా డియోతో పోలిస్తే రెండింటి మధ్య వ్యత్యాసం ఏకంగా 1,054 శాతానికి పైగా ఉంది. గతేడాది ఇదే వ్యవధిలో డియో ఎగుమతులు 77,877 యూనిట్లుగా నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 45,227 యూనిట్లు అదనంగా విదేశీ మార్కెట్లకు తరలివెళ్లాయి. స్పోర్టీ లుక్, తేలికపాటి రైడింగ్ అనుభూతి ఉండటమే అంతర్జాతీయ మార్కెట్లో డియో సక్సెస్‌కు ప్రధాన కారణం.

రెండో స్థానంలో హోండా నేవీ

ఎగుమతుల జాబితాలో రెండవ స్థానాన్ని కూడా హోండా కంపెనీకి చెందిన నేవీ దక్కించుకుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 నాటికి నవి మొత్తం 1,04,032 యూనిట్లు ఎగుమతి అయి డియోకు గట్టి పోటీ ఇచ్చింది. మూడో స్థానంలో టీవీఎస్ ఎన్‌టార్క్ 50,744 యూనిట్లతో నిలవగా, యమహా రేజర్ 41,422 యూనిట్లతో నాలుగో స్థానాన్ని సాధించింది. హీరో జూమ్ 23,791 యూనిట్లు, సుజుకి బర్గ్‌మాన్ 18,716 యూనిట్లు, సుజుకి యాక్సెస్ 14,807 యూనిట్ల మేర ఎగుమతి అయ్యాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎగుమతి గణాంకాలు

పెట్రోల్ వాహనాలతో పాటు భారత్‌లో తయారవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా విదేశాల్లో ఆదరణ పెరుగుతోంది. టీవీఎస్ ఐక్యూబ్ 7,762 యూనిట్లు ఎగుమతి కాగా, బజాజ్ చేతక్ 5,459 యూనిట్ల ఎగుమతులను నమోదు చేసింది. ఏథర్ సంస్థకు చెందిన రిజ్టా 2,502 యూనిట్లు, ఏథర్ 450 మోడల్ 2,271 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. హీరో కంపెనీ విడా ఎలక్ట్రిక్ స్కూటర్ 351 యూనిట్లతో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యాక్టివా ఇవి 3 యూనిట్ల ఎగుమతులు సాధించాయి.

మొత్తం ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి

పరిశ్రమ నివేదికల ప్రకారం ఆర్థిక సంవత్సరం 2027 మొదటి అర్ధభాగంలో మొత్తం 30 రకాల స్కూటర్ మోడళ్లు కలిపి 4,35,363 యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గతేడాది ఇదే సమయానికి నమోదైన 3,22,606 యూనిట్లతో పోలిస్తే ఇది 1,12,757 యూనిట్ల అదనపు వృద్ధిని సూచిస్తోంది. భారతీయ ఆటోమొబైల్ బ్రాండ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేస్తుండటంతో విదేశాల్లో మేడ్ ఇన్ ఇండియా స్కూటర్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.