Honda: కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి హోండా రీఎంట్రీ.. బ్రెజ్జా, నెక్సాన్లకు చుక్కలే
Honda: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు జపాన్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
Honda
Honda: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు జపాన్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత ఆదరణ పొందుతున్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి మరోసారి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా సరికొత్త ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతీయ కారు లవర్ల రుచి, అవసరాలకు తగ్గట్టుగా ఈ నూతన వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపార వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న హోండా కార్స్ ఇండియా 2030 నాటికి దేశంలో ఏకంగా 10 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో చిన్న, మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రత్యేక ప్లాన్‌లో భాగంగానే 2028 నాటికి సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో మంచి ఆదరణ పొందిన బ్రియో, జాజ్, WR-V కార్ల ఉత్పత్తిని నిలిపివేయడంతో ఈ సెగ్మెంట్‌లో హోండాకు ఉన్న పట్టు సడలింది. ప్రస్తుతం అమేజ్ కారు మాత్రమే ఈ సెగ్మెంట్‌లో కంపెనీకి ప్రధాన ఆధారంగా ఉంది. అందుకే ఈ కొత్త ఎస్‌యూవీ ద్వారా కోల్పోయిన మార్కెట్ వాటాను మళ్లీ దక్కించుకోవాలని హోండా గట్టి పట్టుదలతో ఉంది.
ఈ రాబోయే కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన టెక్నికల్ వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ ఇది హోండాకు చెందిన గ్లోబల్ స్మాల్ కార్ ప్లాట్‌ఫారమ్ లేదా సరికొత్త మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఈ అధునాతన ప్లాట్‌ఫారమ్ వివిధ రకాల పవర్‌ట్రైన్‌లకు అనుకూలంగా ఉండటం విశేషం. దీనివల్ల ఈ కొత్త ఎస్‌యూవీ కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే కాకుండా, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా హైబ్రిడ్ అలాగే ఎలక్ట్రిక్ ఆప్షన్లలో కూడా లభించే బలమైన ఛాన్స్ ఉంది. అయితే ఇంజిన్ సామర్థ్యం, బ్యాటరీ పవర్ లేదా మైలేజ్ వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే హోండా కంపెనీ కేవలం కొత్త ఎస్‌యూవీ మాత్రమే కాకుండా మరికొన్ని ఆకర్షణీయమైన మోడళ్లను కూడా భారత మార్కెట్‌కు పరిచయం చేసే పనిలో ఉంది. రాబోయే కొన్ని వారాల్లోనే పాపులర్ మోడల్ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీనితో పాటు కంపెనీ ప్రతిష్టాత్మకమైన 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా భారత్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా సివిక్, అకార్డ్, సీఆర్-వీ వంటి గ్లోబల్ మోడళ్లతో పాటు ప్రిల్యూడ్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్‌ను కూడా పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకుని ప్రీమియం హలో ప్రొడక్ట్ గా విక్రయించే ఆలోచనలో ఉంది.




