Honda WN7 : సూపర్ బైక్ రేంజ్ పవర్.. ఎలక్ట్రిక్ బైక్ ధర.. హోండా WN7 చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Honda WN7 : హోండా తన మొట్టమొదటి స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ WN7ను భారత్‌లో పేటెంట్ చేసింది. 130 కిమీ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో వస్తున్న ఈ బైక్ వివరాలు చూద్దాం.
Honda WN7
Honda WN7 : ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీ తన మొట్టమొదటి స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ WN7ను భారత్‌లో పేటెంట్ చేసింది. 2024 నవంబర్‌లో ప్రదర్శించిన EV Fun కాన్సెప్ట్ ఆధారంగా ఈ బైక్‌ను రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ డిజైన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో వస్తున్న ఈ బైక్ ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఈ బైక్, ఇప్పుడు ఇండియాలో పేటెంట్ పొందడంతో ఇక్కడి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హోండా WN7 డిజైన్ చాలా డిఫరెంట్‌గా, మోడ్రన్‌గా ఉంది. దీని ఫ్రంట్ లుక్ చూడటానికి ఒక రోబోటిక్ ఫీల్‌ను ఇస్తుంది. నేక్డ్ బైక్ తరహాలో సింపుల్ కానీ పవర్‌ఫుల్ డిజైన్‌ను దీనికి జోడించారు. బైక్ ఫ్రేమ్, బ్యాటరీని ఒకే కవర్‌తో కప్పడం వల్ల, ఇది చూడటానికి పెట్రోల్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ లాగే కనిపిస్తుంది. దీనికి వెడల్పాటి LED DRLలు, స్టైలిష్ హెడ్‌లైట్లు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. సింగిల్ సీట్, వైడ్ హ్యాండిల్ బార్, ప్రీమియం లుక్ ఇచ్చే బార్-ఎండ్ మిర్రర్స్‌తో ఈ బైక్ అదిరిపోయే స్టైల్‌ను కలిగి ఉంది.
పెర్ఫార్మెన్స్ విషయంలో హోండా అస్సలు తగ్గలేదు. ఇందులో 50.4 కిలోవాట్ల సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను వాడారు. ఇది సుమారు 67.5 BHP పవర్, 100 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, ఇది ఒక 600 సీసీ స్పోర్ట్స్ బైక్ ఇచ్చే పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుందన్నమాట. ఇందులో 9.3 కిలోవాట్ అవర్ (kWh) లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని హోండా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ బైక్ అంటేనే ఛార్జింగ్ సమస్య గుర్తొస్తుంది. కానీ WN7లో CCS2 బేస్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీనివల్ల బైక్ బ్యాటరీ 20 శాతం నుంచి 80 శాతానికి కేవలం 30 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. అంటే మీ కాఫీ తాగే లోపే బైక్ రెడీ అయిపోతుంది. రాత్రిపూట ఛార్జ్ చేసుకోవడానికి సాధారణ AC ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ బైక్ మొత్తం బరువు 217 కిలోగ్రాములుగా ఉంది.
బ్రిటన్ మార్కెట్లో హోండా WN7 ధర సుమారు 12,999 పౌండ్లు (దాదాపు రూ.16.74 లక్షలు)గా ఉంది. భారత్‌లో కేవలం పేటెంట్ మాత్రమే నమోదు చేసినందున, ఇక్కడ లాంచ్ అవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే హోండా ఎయిర్‌బ్లేడ్ స్కూటర్ కూడా భారత్‌లో పేటెంట్ పొందింది, దానికి లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ WN7 భారత్‌లోకి వస్తే మాత్రం ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.




