భారత మార్కెట్లోకి హోండా కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎంట్రీ.. ధర, ఫీచర్లు చూస్తే షాకే..!

Honda ZR V: హోండా కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న మోడళ్లలో ZR-V అత్యంత ప్రీమియం, ఖరీదైన ఫ్లాగ్‌షిప్ కారుగా నిలిచింది.

Venkat
Published on: 26 July 2026 8:05 PM IST
Honda ZR V
X

భారత మార్కెట్లోకి హోండా కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎంట్రీ.. ధర, ఫీచర్లు చూస్తే షాకే..!

Honda ZR V: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా భారత ఆటోమొబైల్ ప్రేమికులకు గ్రాండ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ 'హోండా ZR-V' హైబ్రిడ్ ఎస్‌యూవీని రూ. 48 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. జపాన్ నుంచి సిబియు (CBU) మార్గంలో నేరుగా దిగుమతి చేసుకుంటున్న ఈ కారు అనేక రికార్డ్ ఫీచర్లతో వచ్చింది.

హోండా కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న మోడళ్లలో ZR-V అత్యంత ప్రీమియం, ఖరీదైన ఫ్లాగ్‌షిప్ కారుగా నిలిచింది. జపాన్ నుంచి కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్ (CBU) రూపంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ మోడల్‌ను దిగుమతి చేసి విక్రయిస్తున్నారు. కస్టమర్ల కోసం ఒకే ఒక్క ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. లగ్జరీ విభాగంలో స్కోడా కోడియాక్, ఫోక్స్‌వాగన్ టైరాన్, టిగువాన్, టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు ఇది గట్టి పోటీని ఇవ్వనుంది.

22.8 కి.మీ మైలేజ్‌ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్..

ఈ కొత్త ఎస్‌యూవీలో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దాని ఇంజిన్ పవర్‌ట్రెయిన్. హోండా ZR-Vలో 2.0-లీటర్ 4-సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌ను రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి స్ట్రాంగ్-హైబ్రిడ్ (e:HEV) వ్యవస్థను అందించారు. ఇది మొత్తం 184 హెచ్‌పి పవర్, 315 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇ-సివిటి (e-CVT) గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు లీటరు పెట్రోల్‌కు ఏకంగా 22.80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. కేవలం 7.9 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీల వేగాన్ని అందుకోగలదు.

స్టైలిష్ డిజైన్.. అదిరిపోయే ఫీచర్లు..

హోండా ఈ కారును సాధారణ ఎస్‌యూవీ ఆకారం కన్నా క్రాసోవర్ శైలిలో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ముందు భాగంలో స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, వర్టికల్ గ్రిల్, 18-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక డ్యూయల్ ఎగ్జాస్ట్ డిజైన్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. కేబిన్ లోపల ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.2-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 12-స్పీకర్ల బోస్ (Bose) సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పాడిల్ షిఫ్టర్లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

భద్రతలో నంబర్ వన్..

సేఫ్టీ విషయంలో హోండా ఎలాంటి రాజీ పడలేదు. ఈ కారులో ఏకంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లెవెల్-2 అడాస్ (ADAS) భద్రతా సాంకేతికతను అందించారు. ఏకకాలంలో పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్, మైలేజ్, ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

ప్రీమియం విభాగంలో హైబ్రిడ్ సాంకేతికతతో వచ్చిన హోండా ZR-V భారత కార్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, హోండా బ్రాండ్ నమ్మకం, మైలేజ్ పరంగా లగ్జరీ కార్ల విభాగానికి గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story