Car Repaint: కారు రంగు మార్చడం క్రిమినల్ నేరమా?.. ఆర్టీవో రూల్స్ ఇవే

Car Repaint: ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు కొన్నేళ్లు గడిచాక పాతబడిపోవడం, రంగు వెలిసిపోవడం సాధారణమే.

CR Reddy
Published on: 11 Sept 2026 9:58 AM IST
Car Repaint
X

Car Repaint

Car Repaint: ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు కొన్నేళ్లు గడిచాక పాతబడిపోవడం, రంగు వెలిసిపోవడం సాధారణమే. అయితే నచ్చని రంగుతో కారును అమ్మేయాల్సిన అవసరం లేదు. మోటారు వాహన చట్టం ప్రకారం ఆర్‌టీవో నుంచి ముందస్తు అనుమతి పొంది చట్టబద్ధంగా మీ కారు రంగును మార్చుకోవచ్చు. దీనివల్ల ట్రాఫిక్ పోలీసుల చలానాలు, సీజ్ భయాలు ఉండవు.

ఆర్‌టీవో నుంచి అనుమతి తప్పనిసరి

చాలామంది కారు కొనేటప్పుడు అత్యంత ఆకర్షణీయమైన రంగును ఎంచుకుంటారు. కాలం గడిచేకొద్దీ ఆ రంగుపై వెలవెలబోయిన దాఖలాలు కనిపిస్తాయి లేదా ఆ మోడల్ చూడటానికి బోర్ కొడుతుంది. కొందరు కొత్త కారు కొనడానికి ఇష్టపడతారు. మరికొందరు పాత కారునే రీస్ప్రే చేయించాలని భావిస్తారు. అయితే నచ్చిన షాప్‌కు వెళ్లి కారు రంగు మార్చేస్తే పోలీసుల నుంచి జరిమానాలు పడే ప్రమాదం ఉంది. ఈ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీవో) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం అత్యంత ముఖ్యం.

దరఖాస్తు ప్రక్రియ.. సమర్పించాల్సిన పత్రాలు

మీ కారు రంగు మార్చడానికి ముందుగా స్థానిక ఆర్‌టీవో కార్యాలయానికి వెళ్లి NAMV ఫారమ్ నింపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులో మీ వాహనం మోడల్, ప్రస్తుతం ఉన్న రంగు, మీరు మార్చాలనుకుంటున్న కొత్త రంగు వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఈ ఫారమ్‌తో పాటు కారు ఒరిజినల్ ఆర్‌సి బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్, చెల్లుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ కాపీ, మీ గుర్తింపు కార్డును జతచేసి అధికారులకు అందజేయాలి. ఆర్‌టీవో అనుమతి లభించిన తర్వాత మాత్రమే గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ వర్క్‌షాప్‌లో కారుకు కొత్త రంగు వేయించాలి.

వాహన తనిఖీ.. ఆర్‌సిలో అప్‌డేట్

కారు రంగు మార్చడం పూర్తయ్యాక, ఆ వాహనాన్ని ఆర్‌టీవో కార్యాలయానికి తీసుకెళ్లి తనిఖీ చేయించాలి. ఆర్‌టీవో అనుమతించిన రంగు, కారుకు వేసిన రంగు ఒక్కటే అని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత ఆర్‌సి పుస్తకంలో రంగు వివరాలను అప్‌డేట్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే మీ కారు లీగల్‌గా కొత్త లుక్‌లోకి మారినట్లే. కారు రంగు మార్చేటప్పుడు పోలీసు లేదా అంబులెన్స్ వాహనాలకు వాడే ప్రత్యేక రంగులను ఎంచుకోకూడదు.

ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు

ఆర్‌టీవో ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ కారు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా రంగు మార్పు సమాచారాన్ని తెలియజేయాలి. ఇన్సూరెన్స్ పాలసీలో ఈ మార్పులను అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగినా, వాహనం చోరీకి గురైనా క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. నాణ్యమైన వినైల్ ర్యాపింగ్ లేదా హై-క్వాలిటీ రీస్ప్రేయింగ్ ఎంచుకోవడం వల్ల కారు రీసేల్ వ్యాల్యూ కూడా పెరుగుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story