Hybrid Cars : ఈవీ కార్లకు షాక్.. ఇప్పుడు అందరి చూపు హైబ్రిడ్ కార్ల వైపే.. అసలు కారణాలివే

Hybrid Cars : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల కంటే హైబ్రిడ్ కార్లకే ఆదరణ పెరుగుతోంది. ఛార్జింగ్ స్టేషన్ల కొరత, మైలేజ్ టెన్షన్ లేకపోవడం వంటి కారణాలతో వాహనదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.

CR Reddy
Published on: 5 July 2026 8:46 AM IST
Hybrid Cars
X

Hybrid Cars

Hybrid Cars : ప్రస్తుతం రోజువారీ ప్రయాణాల కోసం సొంత కారు వాడుతున్న వారు, నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లు కొనాలనే ఆలోచన చాలా మందికి రావడం సహజం. అయితే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. కస్టమర్లు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. వాటి స్థానంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ రెండింటి కలయికతో నడిచే హైబ్రిడ్ కార్ల వైపు వాహనదారులు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు.

హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ల కొరత

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు నెమ్మదించడానికి అతిపెద్ద సవాలు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మన దేశంలో చాలా నగరాల్లో, ముఖ్యంగా జాతీయ రహదారులపై సరిపడా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేవు. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్ లేదా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడ బ్యాటరీ అయిపోతుందోననే భయం డ్రైవర్లను వెంటాడుతోంది. మధ్యలో కారు ఆగిపోతే ఏం చేయాలనే ఈ ఆందోళనే చాలా మందిని ఎలక్ట్రిక్ కార్లు కొనకుండా అడ్డుకుంటోంది.

ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు

ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే హైబ్రిడ్ కార్లు ఈ ఛార్జింగ్ సమస్యకు చాలా సింపుల్ పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. ఈ కార్లలో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక చిన్న ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ఉంటాయి. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. దీనికి బయట నుంచి ప్లగ్ పెట్టి విడిగా ఛార్జింగ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. కారు రోడ్డుపై నడుస్తున్నప్పుడే, ఇంజన్ సహాయంతో బ్యాటరీ దానంతట అదే ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయిపోతుంది. దీనివల్ల డ్రైవర్లు ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం గానీ, ప్రయాణం మధ్యలో ఆగిపోతామనే భయం గానీ ఉండదు.

లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజ్..

హైబ్రిడ్ కార్ల వైపు జనాలు పరుగెత్తడానికి ప్రధాన కారణం వాటిచ్చే మైలేజ్. నగరాల్లో ట్రాఫిక్ వల్ల తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు ఈ కార్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తాయి. దీనివల్ల పెట్రోల్ అస్సలు ఖర్చు కాదు. ఒకసారి కారు వేగం పెరగ్గానే పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. అవసరాన్ని బట్టి ఈ రెండు సిస్టమ్స్ కలిసి పనిచేస్తాయి. ఈ స్మార్ట్ టెక్నాలజీ కారణంగా హైబ్రిడ్ కార్లు లీటరు పెట్రోల్‌కు ఏకంగా 25 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. దీంతో జేబుకు చిల్లు పడకుండా ఇంధన ఖర్చులు సగానికి సగం తగ్గిపోతాయి.

బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చులకు చెక్

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కస్టమర్లను వేధించే మరో పెద్ద సమస్య బ్యాటరీ లైఫ్, దాని రీప్లేస్‌మెంట్ కాస్ట్. కొన్ని సంవత్సరాల తర్వాత ఈవీ కార్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గితే, కొత్త బ్యాటరీ వేయించడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ భారీ ఖర్చుల భయం వల్లే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను ఎవరూ కొనడం లేదు, దాంతో వాటి రీసేల్ వాల్యూ దారుణంగా పడిపోతోంది. కానీ హైబ్రిడ్ కార్లలో బ్యాటరీ పరిమాణం చిన్నదిగా ఉండటం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల వీటికి మార్కెట్లో పాత పెట్రోల్ కార్ల లాగే మంచి రీసేల్ వాల్యూ లభిస్తోంది.

భవిష్యత్తు అంతా హైబ్రిడ్ కార్లదేనా?

ఛార్జింగ్ పెట్టే జంజాటం లేకపోవడం, తిరుగులేని మైలేజ్ ఇవ్వడం, నమ్మకమైన రీసేల్ వాల్యూ ఉండటం వంటి ఫీచర్ల వల్ల హైబ్రిడ్ కార్లు నేడు కార్ల ప్రియుల మొదటి ఛాయిస్‌గా మారాయి. దేశంలో పూర్తి స్థాయిలో ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేంత వరకు, అంటే రాబోయే మరికొన్ని సంవత్సరాల పాటు భారత ఆటోమొబైల్ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల హవా ఇలాగే కొనసాగుతుందని, ఈ ట్రెండ్ మరింత బలోపేతం అవుతుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story