Hyundai Bayon: లాంచ్‌కు ముందే లీకైన హ్యుందాయ్ బేయాన్.. డీలర్‌యార్డ్‌లో మెరిసిన కొత్త ఎస్‌యూవీ

Hyundai Bayon: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లోకి త్వరలోనే బేయాన్ పేరుతో ఒక సరికొత్త ఎస్‌యూవీని తీసుకురాబోతోంది.

CR Reddy
Published on: 20 Oct 2026 11:07 AM IST
Hyundai Bayon
X

Hyundai Bayon 

Hyundai Bayon: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లోకి త్వరలోనే బేయాన్ పేరుతో ఒక సరికొత్త ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. అక్టోబర్ 26న ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ ఎస్‌యూవీ మోడళ్లు కంపెనీ డీలర్‌యార్డ్‌కు చేరుకోవడంతో దానికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ 4.2 మీటర్ల పొడవు గల ఎస్‌యూవీ, హ్యుందాయ్ భారతీయ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన వెన్యూ అలాగే క్రెటా మోడళ్ల మధ్య స్థానాన్ని దక్కించుకోనుంది. ఈ కారు బుకింగ్‌లను రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ మొత్తంతో కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది.

లీకైన ఫోటోల ఆధారంగా హ్యుందాయ్ బేయాన్ ఎక్స్‌టీరియర్ డిజైన్ అత్యంత షార్ప్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. రెడ్ కలర్ బాడీపై ఉన్న కట్స్, లైన్లు కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. బోనెట్ చివరల్లో సన్నని H-ఎడ్జ్ LED డే-టైమ్ రన్నింగ్ లైట్లు అందించారు. ముందు భాగంలో విశాలమైన గ్రిల్, దాని ఇరువైపులా అమర్చిన ప్రధాన హెడ్‌లాంప్స్ కారుకు రగ్గడ్ ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చాయి. వెనుక వైపు BAYON అక్షరాలతో పాటు కనెక్టెడ్ LED లైటింగ్ థీమ్, రూఫ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా అలాగే జియోమెట్రిక్ డిజైన్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

బేయాన్ ఇంటీరియర్ ఫోటోలను పరిశీలిస్తే, లోపల డ్యూయల్-టోన్ కేబిన్ కనిపించనుంది. ఇందులో 12.3 ఇంచుల సైజు గల రెండు స్క్రీన్‌లు ఒకే కర్వ్‌డ్ పనోరమిక్ ప్యానెల్‌లో అమర్చబడి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేగా పనిచేస్తాయి. ఇన్ఫోటైన్‌మెంట్ కింద మీడియా, మ్యాప్స్ కంట్రోల్ చేయడానికి ఫిజికల్ షార్ట్‌కట్ బటన్లు ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్ సెలెక్టర్, డ్యూయల్ USB-C పోర్టులు, పుష్-బటన్ స్టార్ట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లాంటి అధునాతన సదుపాయాలతో కేబిన్ ఎంతో రిచ్‌గా డిజైన్ చేశారు.

టెక్నికల్ విషయాలకు వస్తే.. హ్యుందాయ్ ఈ కారులో జనరేటివ్ AI వాయిస్ అసిస్టెంట్‌ను జోడించింది. ఇది ఇంగ్లీష్‌తో పాటు హిందీ సహా 6 భాషల్లో 500 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్లను అర్థం చేసుకోగలదు. 70 కంటే ఎక్కువ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ ఇందులో ఉన్నాయి. ఇంజిన్ పరంగా 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రానుంది. ఇది 115 PS పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులకు 6-స్పీడ్ మాన్యువల్ లేదా IVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు లభించనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.