Hyundai: నెక్సాన్ ఈవీ, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలకు గట్టి షాక్.. హ్యుందాయ్ నుంచి పవర్పుల్ చిన్న ఎలక్ట్రిక్ కారు
Hyundai: భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా, మహీంద్రా ఆధిపత్యానికి గండి కొట్టేందుకు సౌత్ కొరియా దిగ్గజం హ్యుందాయ్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది.
Hyundai
Hyundai: భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా, మహీంద్రా ఆధిపత్యానికి గండి కొట్టేందుకు సౌత్ కొరియా దిగ్గజం హ్యుందాయ్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఏకంగా 355 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే సరికొత్త కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీని వచ్చే ఏడాది చివరి నాటికి ప్రవేశపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భారత మార్కెట్లో ప్రస్తుతం హ్యుందాయ్ నుంచి క్రెటా ఈవీ, ఐయోనిక్ 5 మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా కేవలం 1 శాతంగా మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే భారతీయ వినియోగదారులకు అనుగుణంగా తక్కువ ధరకే ప్రీమియం అనుభూతిని అందించే సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును భారత రోడ్లపైకి తేవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నాటికి దేశీయ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటాను ఏకంగా 7 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.
కోడ్‌నేమ్ HE1i పేరుతో అభివృద్ధి చెందుతున్న ఈ చిన్న ఈవీని గ్లోబల్ లెవల్లో బాగా పేరు పొందిన ఈ-జిఎమ్‌పి (K) ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. ఈ మోడల్ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో రానుంది. విదేశీ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇన్ స్టర్ ఈవీ కారు తరహాలోనే ఇది 42 కిలోవాట్ అవర్, 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లతో రాబోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది సింగిల్ ఛార్జింగ్ మీద దాదాపు 355 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ సామర్థ్యాన్ని అందిస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రారంభ దశలో ఈ ఎలక్ట్రిక్ కారు కొరకు ఎస్వోల్ట్ కంపెనీ నుంచి సేకరించిన బ్యాటరీ సెల్స్ వాడనున్నారు. స్థానికంగా ఎక్సైడ్ కంపెనీ ద్వారా సెళ్ల తయారీ ఆలస్యం అవుతుండటంతో ప్రాజెక్ట్ లేట్ కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హ్యుందాయ్ యాజమాన్యం స్పష్టం చేసింది. తదనంతర కాలంలో స్వదేశీ బ్యాటరీ సెళ్లతోనే ఉత్పత్తి సాగించనున్నారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి పనులు పూర్తి కానున్నాయి. ఫలితంగా ఉత్పత్తి వ్యయం తగ్గి వినియోగదారులకు అందుబాటు ధరలోనే లభించే అవకాశముంది.
ఈ అప్‌కమింగ్ స్మాల్ ఈవీ కారులో హ్యుందాయ్ సరికొత్త ఇంటీరియర్ లేఅవుట్‌ను అందించబోతోంది. లగ్జరీ కార్లలో లభించే ప్లియోస్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ లెవెల్ 2 అడాస్ సాంకేతికతను ఇందులో పొందుపరచనున్నారు. భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన వెంటనే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీ, కియా సిరోస్ ఈవీలకు ఈ మోడల్ గట్టి పోటీనిస్తుందని వాహన రంగ నిపుణులు భావిస్తున్నారు.




