Hyundai Creta EV : రెండు బ్యాటరీ ఆప్షన్లు.. 510 కిమీల మైలేజ్.. హ్యుందాయ్ క్రెటా ఈవీ.!

Hyundai Creta EV : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'క్రెటా' ఎలక్ట్రిక్ వెర్షన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక సంచలనాత్మక..

G Krishna
Published on: 3 July 2026 11:14 AM IST
hyundai creta ev
X

hyundai creta ev

Hyundai Creta EV : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'క్రెటా' ఎలక్ట్రిక్ వెర్షన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక సంచలనాత్మక మార్పును తీసుకొచ్చింది. ఈవీ కార్ల కొనుగోలుకు ప్రధాన అడ్డంకిగా మారిన భారీ ధరను తగ్గించేందుకు కంపెనీ సరికొత్త 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) ఓనర్‌షిప్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు ధర నుండి బ్యాటరీ ఖర్చు విడిపోవడంతో, క్రెటా ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర ఏకంగా రూ. 10.99 లక్షలకే (ఎక్స్-షోరూమ్) పడిపోయింది. కారు కొన్నవారు బ్యాటరీ కోసం కేవలం ప్రయాణించే కిలోమీటర్‌కు రూ. 3.9 చొప్పున ఈఎంఐ (EMI) రూపంలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది.

ధరల భారం తగ్గించే బాస్ (BaaS) మోడల్

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఖర్చులో బ్యాటరీదే సింహభాగం. అందుకే ఈవీల ప్రారంభ ధరలు ఎక్కువుగా ఉంటాయి. ఒకవేళ బ్యాటరీ ధరతో కలిపి కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతం క్రెటా ఈవీ శ్రేణి ధరలు రూ. 18.03 లక్షల నుండి ప్రారంభమై రూ. 24.70 లక్షల వరకు ఉన్నాయి. కానీ ఈ కొత్త 'బాస్' (BaaS) ప్రోగ్రామ్ ద్వారా కారును తక్కువ ధరకే కొనుగోలు చేసి, బ్యాటరీని అద్దె ప్రాతిపదికన వాడుకోవచ్చు. మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించేందుకు, ఈవీల విక్రయాలను పెంచేందుకు హ్యుందాయ్ ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది.

కొత్త ఫీచర్లు.. మెరుగైన చార్జింగ్ ప్యాకేజీ

ఈ సరికొత్త ఓనర్‌షిప్ మోడల్‌తో పాటు క్రెటా ఈవీలో వినియోగదారుల సౌకర్యార్థం కొన్ని మార్పులు చేశారు. కారు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్‌ను అదనంగా చేర్చారు. ఇది కారుకు మరింత రగ్గడ్ ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తుంది. దీంతో పాటు హోమ్ చార్జింగ్ ప్యాకేజీని కూడా అప్‌గ్రేడ్ చేశారు. హోమ్ చార్జర్ ఆప్షన్ ఉన్న వేరియంట్లను కొనుగోలు చేసే వారికి ఇప్పుడు మరింత వేగంగా చార్జ్ అయ్యే 7.4kW వాల్ బాక్స్ చార్జర్‌ను కంపెనీ అందిస్తోంది.

రెండు బ్యాటరీ ఆప్షన్లు.. 510 కిమీల మైలేజ్

సాంకేతికంగా క్రెటా ఈవీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మునుపటిలాగే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. స్టాండర్డ్ 42kWh బ్యాటరీ వెర్షన్ ఒక్కసారి చార్జ్ చేస్తే 420 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) మైలేజ్ ఇస్తుంది. అలాగే పెద్దదైన 51.4kWh లాంగ్-రేంజ్ బ్యాటరీ వెర్షన్ ఏకంగా 510 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది. కారు ముందు భాగంలో ఉండే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడిచే ఈ ఎస్‌యూవీ.. డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 39 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. లాంగ్-రేంజ్ మోడల్ కేవలం 7.9 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఫీచర్ల విషయానికొస్తే..

సరికొత్త సైడ్ ఫుట్ స్టెప్‌తో పాటు మరిన్ని హైటెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీ, వెహికల్-టు-లోడ్ (V2L) ఫంక్షనాలిటీ, సింగిల్ పెడల్ డ్రైవ్ (i-Pedal), స్మార్ట్‌ఫోన్ , స్మార్ట్‌వాచ్‌తో కనెక్ట్ అయ్యే డిజిటల్ కీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, కారు బ్యాటరీ ప్యాక్‌పై హ్యుందాయ్ ఏకంగా 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని కూడా అందిస్తోంది.

నెట్‌వర్క్ విస్తరణపై హ్యుందాయ్ ఫోకస్

ఉత్పత్తులను పెంచడమే కాకుండా దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా హ్యుందాయ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 183 ప్రాంతాల్లో 214 డీసీ ఫాస్ట్ చార్జర్లు, 399 చార్జింగ్ పాయింట్లను కలిగి ఉంది. రాబోయే ఏడేళ్లలో ఈ నెట్‌వర్క్‌ను మరింత పెంచి, భారతదేశం అంతటా దాదాపు 600 పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, కస్టమర్లు తమ 'మై హ్యుందాయ్' (myHyundai) యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 10,000 కంటే ఎక్కువ ఈవీ చార్జింగ్ పాయింట్లను సులభంగా గుర్తించి వాడుకోవచ్చు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story