Hyundai : భారత్‌లో హుందాయ్ 30 ఏళ్ల ప్రస్థానం.. రానున్న ఐదేళ్లలో రూ.45,000 కోట్లు.. 2030 నాటికి 26 కొత్త కార్లు
Hyundai : భారత్‌లో హుందాయ్ మోటార్స్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2030 నాటికి 26 కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు రూ. 45 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది.
Hyundai
Hyundai : దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హుందాయ్ భారత మార్కెట్లో అడుగుపెట్టి అప్పుడే మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. 1996లో చిన్న అడుగుతో మొదలైన ఈ ప్రయాణం, ఇప్పుడు దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఎదిగేలా చేసింది. ఈ 30 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని హుందాయ్ మోటార్ ఇండియా తన భవిష్యత్తు ప్రణాళికలను, భారీ పెట్టుబడులను ప్రకటించింది. రానున్న ఐదేళ్లలో భారత్‌ను గ్లోబల్ ఎగుమతి హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కంపెనీ అడుగులు వేస్తోంది.
ముప్పై ఏళ్ల ప్రస్థానం - అద్భుతమైన రికార్డులు
1996లో భారతదేశంలోకి ప్రవేశించిన హుందాయ్, 1998లో తన మొదటి ప్లాంట్‌ను చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ మొత్తం 1.35 కోట్ల కార్లను విక్రయించింది. ఇందులో 96 లక్షల కార్లు భారతీయుల సొంతం కాగా, సుమారు 39 లక్షల కార్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. సౌదీ అరేబియా, మెక్సికో, చిలీ వంటి దేశాలకు భారత్ నుంచే కార్లు వెళ్లడం మన దేశ తయారీ రంగానికి గర్వకారణం.
భారీ పెట్టుబడులు.. భవిష్యత్తుపై గురి
గడిచిన 30 ఏళ్లలో హుందాయ్ దాదాపు రూ.40,700 కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే, భవిష్యత్తుపై ఉన్న నమ్మకంతో రానున్న ఐదేళ్లలో (FY26 నుంచి FY30 మధ్య) ఏకంగా రూ.45,000 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ, కొత్త టెక్నాలజీ అభివృద్ధి, మేన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని పెంచడం కోసం కేటాయించనున్నారు. 2030 నాటికి 26 కొత్త కార్లు లేదా వాటి వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
పెరగనున్న తయారీ సామర్థ్యం
ప్రస్తుతం హుందాయ్కు చెన్నై, పుణే (తాలేగావ్)లో ప్లాంట్లు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్ల ద్వారా ఏడాదికి సుమారు 9.94 లక్షల కార్లను తయారు చేసే కెపాసిటీ ఉంది. దీనిని 2028 నాటికి 10.74 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల ఎగుమతులకు మరింత ఊతం లభించడమే కాకుండా, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను కూడా సులభంగా అందుకోవచ్చు.
దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్
హుందాయ్ సక్సెస్‌లో దాని సేవా నెట్వర్క్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం దేశంలోని 1,100 నగరాల్లో 1,500 కంటే ఎక్కువ షోరూమ్‌లు ఉన్నాయి. అంటే దేశంలోని 78 శాతం జిల్లాల్లో హుందాయ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 1,675 సర్వీస్ పాయింట్లు, 50,000 మందికి పైగా నిపుణులైన సర్వీస్ ప్రొఫెషనల్స్‌తో కస్టమర్లకు నిరంతరం అందుబాటులో ఉంటోంది. 162 మొబైల్ సర్వీస్ వ్యాన్ల ద్వారా కస్టమర్ల ముంగిటకే సేవలను అందిస్తోంది.
సరికొత్త మొబిలిటీ దిశగా..
కేవలం కార్లను అమ్మడమే కాకుండా, ఫ్యూచర్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టాలని హుందాయ్ భావిస్తోంది. రానున్న రోజుల్లో లాంచ్ చేయబోయే 26 కొత్త కార్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేయనున్నారు. భారతీయుల అభిరుచులకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో కూడిన ఇవీ (EV)లను తీసుకురావడం ద్వారా మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.




