Hyundai: క్రెటా, అల్కజార్ కంటే పెద్ద SUVతో హ్యుందాయ్.. 2027లో రాబోతోందా?

హ్యుందాయ్ కొత్త 7 సీటర్ SUV Ni1i టెస్టింగ్‌లో కనిపించింది. బాక్సీ డిజైన్, 18 ఇంచుల అల్లాయ్ వీల్స్, AI వాయిస్ అసిస్టెంట్, ADAS ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

CR Reddy
Published on: 20 Nov 2026 9:23 AM IST
Hyundai Ni1i 7-Seater
X

Hyundai Ni1i 7-Seater

Hyundai: ఏడు సీట్ల SUV కొనాలనుకునే వారికి హ్యుందాయ్ నుంచి మరో కొత్త మోడల్ రాబోతోంది. కంపెనీకి చెందిన Ni1i కోడ్‌నేమ్‌తో ఉన్న పెద్ద SUV తాజాగా టెస్టింగ్‌లో కనిపించింది. పూర్తిగా కవర్ చేసిన వాహనం ఫొటోలు బయటకు రావడంతో దీని డిజైన్, ఫీచర్లు, ఇంజిన్‌పై చర్చ మొదలైంది. మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ వంటి SUVలకు పోటీగా ఈ మోడల్‌ను తీసుకురావచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం హ్యుందాయ్ విక్రయిస్తున్న అల్కజార్ కంటే పెద్దదిగా, ప్రీమియం SUV విభాగంలో నిలిచేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

బాక్సీ డిజైన్.. 18 ఇంచుల అల్లాయ్ వీల్స్

బయటకు వచ్చిన టెస్టింగ్ ఫొటోలను బట్టి ఈ SUV నిటారుగా ఉండే బాక్సీ డిజైన్‌తో కనిపిస్తోంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, నిటారుగా ఉండే బంపర్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ ఉండే అవకాశం ఉంది. సన్నని LED DRLలు, కింద స్కిడ్ ప్లేట్ తరహా డిజైన్ కూడా రావచ్చని అంచనా. పక్కవైపు 18 ఇంచుల గన్‌మెటల్ గ్రే అల్లాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. వీల్ ఆర్చ్‌ల చుట్టూ క్లాడింగ్, పెద్ద కిటికీలు, కొత్త డిజైన్ ORVMలు ఉన్నాయి. అయితే కారు వెనుక భాగం పూర్తిగా కనిపించకపోవడంతో టెయిల్ ల్యాంప్స్, బూట్ డిజైన్ వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

AI వాయిస్ అసిస్టెంట్ వచ్చే ఛాన్స్

ఈ SUV లోపలి భాగానికి సంబంధించిన ఫొటోలు ఇంకా బయటకు రాలేదు. అయితే పోటీని దృష్టిలో పెట్టుకుని హ్యుందాయ్ ఇందులో అధునాతన ఫీచర్లు అందించవచ్చని అంచనా. కొత్త Pleos Connect ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, జనరేటివ్ AI వాయిస్ అసిస్టెంట్, కొత్త స్టీరింగ్ వీల్ ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు లెదరెట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ సీట్లు, సీట్ వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు రావచ్చని ఆటోమొబైల్ నివేదికలు పేర్కొంటున్నాయి. భద్రత కోసం లెవల్ 2+ ADAS, రెండో వరుసలో కెప్టెన్ సీట్లు, వన్-టచ్ టంబుల్ సీట్లు వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చని సమాచారం. ఇవన్నీ ప్రస్తుతానికి అంచనాలే.

హైబ్రిడ్ ఇంజిన్‌తో రానుందా?

ఈ SUVలో హైబ్రిడ్ ఇంజిన్ ఉండొచ్చన్నది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం. నివేదికల ప్రకారం హ్యుందాయ్ 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌పై పనిచేస్తోంది. ఇదే ఇంజిన్‌ను భవిష్యత్తులో కొత్త క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లలోనూ ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు 1.6 లీటర్ల టర్బో పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే Ni1iలో ఏ ఇంజిన్‌ను అందిస్తారు? ఎలాంటి గేర్‌బాక్స్ ఉంటుంది? మైలేజీ ఎంత వస్తుంది? అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

2027లో విడుదలయ్యే అవకాశం

హ్యుందాయ్ ఈ SUVని 2027లో తీసుకురావచ్చని మొదట్లో అంచనాలు వచ్చాయి. అయితే తాజా ఆటోమొబైల్ నివేదికల ప్రకారం దీని విడుదల 2027 చివరి వరకు ఆలస్యం కావచ్చు. హ్యుందాయ్ అధికారిక వార్షిక నివేదికలో 2027 ఆర్థిక సంవత్సరానికి SUV విభాగంలో కొత్త పెట్రోల్ ఇంజిన్ వాహనంతో పాటు ప్రత్యేక ఎలక్ట్రిక్ SUVని తీసుకురావాలనే ప్రణాళికను వెల్లడించింది. కానీ ఆ నివేదికలో Ni1i పేరు, ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించలేదు. ఈ కొత్త 7-సీటర్ SUV మార్కెట్లోకి వస్తే మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, స్కార్పియో N వంటి మోడళ్లకు పోటీ ఇవ్వొచ్చు. ధర, పూర్తి ఫీచర్లు, లాంచ్ తేదీపై హ్యుందాయ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.