Hyundai New SUV : మారుతి సుజుకికి గట్టి పోటీ.. మార్కెట్లోకి హ్యుందాయ్ కొత్త బాస్ఎ స్‌యూవీ

Hyundai New SUV : భారత మార్కెట్లో మారుతి విక్టోరిస్‌కు పోటీగా హ్యుందాయ్ కంపెనీ వెన్యూ, క్రెటా కార్ల మధ్య సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీని పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లతో లాంచ్ చేయబోతోంది.

CR Reddy
Published on: 2 Jun 2026 8:03 AM IST
Hyundai India
X

 Hyundai India

Hyundai New SUV : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం కార్ల కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మన దేశంలో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో సరికొత్త మోడళ్లతో ఇండియన్ రోడ్లపైకి దూసుకురావడానికి రెడీ అయింది. కంపెనీ నుంచి రెండు సరికొత్త ఎస్‌యూవీలతో పాటు ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు హ్యుందాయ్ అధికారికంగా ధృవీకరించింది.

వెన్యూ, క్రెటా కార్ల మధ్యలో కొత్త ఎస్‌యూవీ

హ్యుందాయ్ కంపెనీ ప్రస్తుతం తీసుకురాబోయే సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీ.. మార్కెట్లో ఇప్పటికే సూపర్ హిట్ అయిన హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ క్రెటా కార్ల మధ్య ఖాళీని భర్తీ చేయనుంది. అంటే ఇది వెన్యూ కంటే కాస్త పెద్దదిగా, క్రెటా కంటే కొంచెం చిన్నదిగా ఉండబోతోంది. ఈ సరికొత్త ఎస్‌యూవీని హ్యుందాయ్ కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 లో భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోడల్ కార్ల ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉంది. హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఈ కొత్త కారు మార్కెట్లోకి వస్తే.. దీనికి ప్రధాన పోటీదారుగా మారుతి సుజుకి నిలవనుంది. మారుతి సుజుకి త్వరలోనే తీసుకురాబోయే మారుతి సుజుకి విక్టోరిస్ ఎస్‌యూవీకి ఇది గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు కార్ల మధ్య జరగబోయే పోరు ఇండియన్ ఆటోమొబైల్ రంగాన్ని మరింత హీటెక్కించనుంది.

యూరోప్ బేయాన్ ఆధారంగా సరికొత్త డిజైన్

హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త కారుకు అంతర్గతంగా Bc4i అనే ప్రాజెక్ట్ పేరును పెట్టింది. ప్రస్తుతం యూరప్ దేశాల్లో విక్రయిస్తున్న హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే దీనిని తయారు చేస్తున్నారు. అయితే యూరోపియన్ మోడల్‌తో పోలిస్తే భారతీయ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా దీని పొడవును దాదాపు 4.18 మీటర్లుగా డిజైన్ చేస్తున్నారు. మన దేశంలోని రోడ్లకు సెట్ అయ్యేలా మంచి రోడ్ ప్రెజెన్స్, కారు లోపల ఎక్కువ స్పేస్ ఉండేలా హ్యుందాయ్ ఈ కారును మరింత దృఢంగా మారుస్తోంది.

పెట్రోల్ తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా

భారతదేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో మధ్యతరగతి ప్రజలు సీఎన్‌జీ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి హ్యుందాయ్ తన కొత్త ఎస్‌యూవీని సాధారణ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్ లో కూడా తీసుకురానుంది. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

గ్లోబల్ మోడల్ లో అదిరిపోయే ఇంజిన్ ఆప్షన్లు

అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ బేయాన్ కారును ప్రముఖ హ్యుందాయ్ i20 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించారు. గ్లోబల్ మార్కెట్ లో దీనికి మూడు ఇంజిన్ ఆప్షన్లు ఇస్తున్నారు. అందులో మొదటిది 1.2 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, రెండోది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మూడోది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ తో కూడిన 48V మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్. వీటికి 5-స్పీడ్, 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఇండియా వెర్షన్ లో ఏ ఇంజిన్ వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story