Hyundai: పెద్ద ఫ్యామిలీల కోసం త్వరలోనే మార్కెట్లోకి హ్యుందాయ్ కొత్త 7 సీటర్ ఎంపీవీ

Hyundai: భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్స్ రాబోయే ఐదేళ్లలో దాదాపు 26 కొత్త వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

CR Reddy
Published on: 20 Oct 2026 10:55 AM IST
Hyundai Neira
X

Hyundai Neira

Hyundai: భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్స్ రాబోయే ఐదేళ్లలో దాదాపు 26 కొత్త వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యంగా పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక సరికొత్త ఎంపీవీ మోడల్‌ను తీసుకురాబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఫ్యామిలీ కారును నెయిరా పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇండోనేషియాలో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించిన నెయిరా ఈవీ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని రూపుదిద్దుతున్నారు. ఈ కారును 2027లో జరగబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటిసారిగా ప్రదర్శించే అవకాశం ఉంది.

స్టైలిష్ డిజైన్ అలాగే ఎక్స్‌టీరియర్ విశేషాలు

హ్యుందాయ్ నెయిరా ఎంపీవీ ఎక్స్‌టీరియర్ డిజైన్ అత్యంత ఆధునికంగా, ఆకట్టుకునేలా ఉండనుంది. కారు ముందు భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్, దాని కింద రెండు సమాంతర స్లాట్లు అలాగే సిల్వర్ క్లాడింగ్ లభించనున్నాయి. స్పోర్టీ బంపర్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఈ కారుకు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. వెనుక భాగంలో కొత్త బంపర్ డిజైన్‌తో పాటు హ్యుందాయ్ లోగో అలాగే ప్రీమియం సిల్వర్ ఫినిషింగ్ క్లాడింగ్ కారును మరింత అందంగా మార్చనున్నాయి.

అడ్వాన్స్‌డ్ కేబిన్, 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్స్

ఈ కొత్త ఎంపీవీ ఇంటీరియర్ కేబిన్‌ను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. డ్రైవర్ సౌకర్యం కోసం రెండు స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, దానిపై హ్యుందాయ్ ప్రత్యేక నాలుగు చుక్కల లోగోను అందించారు. డ్యాష్‌బోర్డ్‌పై రెండు 12.3 అంగుళాల భారీ డిజిటల్ స్క్రీన్‌లను అమర్చారు. అందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం, మరొకటి డ్రైవర్ సమాచారం కోసం ఉపయోగపడుతుంది. క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు గొప్ప అనుభూతిని అందిస్తాయి.

7-సీటర్ లేఅవుట్, రకరకాల ఇంజిన్ ఆప్షన్లు

పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును 7-సీటర్ లేఅవుట్‌తో మార్కెట్లోకి తీసకురానున్నారు. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కారు పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ అలాగే సీఎన్‌జీ ఇంజిన్ రూపాల్లో లభించే అవకాశం ఉంది. రూ. 20 లక్షల లోపు ధరలో రానున్న ఈ ఎంపీవీ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్ క్లావిస్ వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మల్టీపుల్ ఫ్యూయల్ ఆప్షన్లు ఉండటంతో మైలేజ్ అలాగే పనితీరు కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక కానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.