New SUVs: హ్యుందాయ్ ధమాకా ప్లాన్.. మార్కెట్లోకి 3 సరికొత్త ఎస్‌యూవీలు
New SUVs: భారత మార్కెట్లోకి హ్యుందాయ్ కంపెనీ మూడు కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
Hyundai
New SUVs: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. 2030 నాటికి దేశీయ మార్కెట్లోకి ఏకంగా 26 కొత్త కార్లను, అలానే ప్రస్తుత మోడళ్ల కొత్త వెర్షన్లను పరిచయం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2027 నాటికి మూడు సరికొత్త అధునాతన ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సన్నాహాలు వేగవంతం చేసింది. హ్యుందాయ్ మార్కెట్లోకి తేనున్న కొత్త బెయాన్ సీఎన్‌జీ, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, కొత్త జెనరేషన్ క్రెటా మోడళ్లపై ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్‌తో హ్యుందాయ్ బేయాన్
హ్యుందాయ్ కంపెనీ బెయాన్ సీఎన్‌జీ మోడల్‌ను 2027 జనవరిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ కారులో 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. సాధారణంగా సీఎన్‌జీ సిలిండర్ డిక్కీలో ఉండటం వల్ల లగేజ్ స్పేస్ తగ్గుతుంది. కానీ ఈ కారులో అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. సిలిండర్‌ను కారు కింద భాగంలో అమర్చడం వల్ల కేబిన్, బూట్ స్పేస్ లగేజ్ పెట్టుకోవడానికి సరిపడా మిగులుతుంది. బయట డిజైన్ పెట్రోల్ వెర్షన్ లాగే ఉన్నప్పటికీ, సీఎన్‌జీ బ్యాడ్జింగ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
కొత్త కోడ్‌నేమ్ HE1i ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
హ్యుందాయ్ తీసుకొస్తున్న రెండో ప్రధాన మోడల్ 'HE1i' కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. E-GMP (K) ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతున్న ఈ ఈవీ స్టాండర్డ్, లాంగ్ రేంజ్ ఆప్షన్లలో లభించనుంది. ఇందులో చైనాకు చెందిన ఎస్‌వోల్ట్ కంపెనీకి చెందిన ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ సెల్స్‌ను వాడనున్నారు. లెవెల్-2 అడాస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, సరికొత్త ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో బాక్సీ డిజైన్‌లో ఈ కారు రానుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.12 లక్షలు ఉండవచ్చని అంచనా.
స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌తో నెక్స్ట్ జెనరేషన్ క్రెటా
హ్యుందాయ్ అత్యంత పాపులర్ మోడల్ క్రెటా కొత్త జెనరేషన్ వెర్షన్ కూడా 2027లోనే ల్యాండ్ కానుంది. కొత్త కియా సెల్తోస్‌లో వాడిన 'K3' ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును డిజైన్ చేస్తున్నారు. మునుపటి మోడల్ కంటే ఇది పరిమాణంలో కాస్త పెద్దదిగా, మరింత షార్ప్ లుక్‌తో రానుంది. ఇంజిన్ పరంగా ప్రస్తుతమున్న 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు కొనసాగుతాయి. అయితే ఈ కొత్త మోడల్‌లో అత్యంత ప్రధాన మార్పు స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ అందుబాటులోకి రావడం కావడం గమనార్హం.




