పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు గుడ్‌బై? ఎల్‌పీజీకి మార్చేందుకు కొత్త పాలసీ

పాత పెట్రోల్‌, డీజిల్‌ కార్లను ఆటో ఎల్‌పీజీకి మార్చేందుకు జాతీయ రీట్రోఫిట్ విధానం తీసుకురావాలని పరిశ్రమ కేంద్రాన్ని కోరింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Aug 2026 1:40 AM IST
Auto LPG Retrofit
X

Auto LPG Retrofit

Auto LPG Retrofit : దేశంలో పెరుగుతున్న పాత కార్ల మార్కెట్‌ను వాయు కాలుష్య నియంత్రణకు ఉపయోగించుకోవాలని పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వినియోగంలో ఉన్న వాహనాలను ఆటో ఎల్‌పీజీకి మార్చేందుకు కాలపరిమితితో కూడిన జాతీయ స్థాయి రీట్రోఫిట్ విధానాన్ని తీసుకురావాలని సూచించాయి.

భారత్‌లో ఏటా దాదాపు 60 లక్షల వరకు పాత వాహనాల విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ మార్కెట్‌ ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవచ్చని ఇండియన్ ఆటో ఎల్‌పీజీ కోలిషన్‌ (ఐఏసీ) తెలిపింది. దేశంలో ఆటో ఎల్‌పీజీ ప్రోత్సాహానికి కీలక సంస్థగా ఉన్న ఐఏసీ.. ఇందుకోసం ప్రత్యేక రీట్రోఫిట్ విధానం అవసరమని పేర్కొంది.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను ఆటో ఎల్‌పీజీకి మార్చేలా స్పష్టమైన నిబంధనలు, ప్రమాణాలతో కూడిన విధానం రూపొందించాలని పరిశ్రమ సంస్థ సూచించింది. దీనివల్ల ఇప్పటికే రోడ్లపై ఉన్న వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపింది.

దేశంలో పాత వాహనాల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తున్నందున.. దాన్ని వాహన కాలుష్యాన్ని తగ్గించే సాధనంగా మార్చుకోవచ్చని ఐఏసీ పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు గాలి నాణ్యత ప్రమాణాలను అందుకోలేకపోతున్న ఇతర నగరాల్లో ఈ విధానం గణనీయమైన ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది.

పాత వాహనాలను పూర్తిగా తొలగించడం లేదా కొత్త వాహనాలతో భర్తీ చేయడానికంటే.. ఇప్పటికే వినియోగంలో ఉన్న వాహనాలను తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే ఇంధనానికి మార్చడం వేగవంతమైన, ఆచరణాత్మక పరిష్కారంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆటో ఎల్‌పీజీ రీట్రోఫిట్ విధానం తీసుకొస్తే.. పాత వాహనాల మార్కెట్‌ను మరింత పర్యావరణహితంగా మార్చడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఐఏసీ పేర్కొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story