Car Sales  : ట్రెండ్ మారింది.. చిన్న కార్లను పక్కన పెట్టి వాటి వెంటే పడుతున్న భారతీయులు

Car Sales  : భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో ఎస్‌యూవీ కార్లు, స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.

CR Reddy
Published on: 16 July 2026 8:12 AM IST
Car Sales 
X

Car Sales 

Car Sales : భారతదేశంలో వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్ల ఆలోచనా విధానంలో, ట్రెండ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశీయ ఆటోమొబైల్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో, అంటే ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు జరిగిన విక్రయాలలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూడు నెలల కాలంలో కార్లు, టూ-వీలర్స్ అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, భారత కార్ల మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ హవా మరింత పెరగగా, టూ-వీలర్ విభాగంలో మోటార్ సైకిళ్ల కంటే స్కూటర్ల అమ్మకాల వేగం పుంజుకుంది.

గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య కాలంలో భారతదేశంలో మొత్తం 12,73,811 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ విక్రయాలు సుమారు 26 శాతం పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఎస్‌యూవీ రకం కార్లకే డిమాండ్ వచ్చింది. మొత్తం అమ్ముడైన కార్లలో ఏకంగా 68 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం విశేషం. అంటే మార్కెట్లోకి వస్తున్న ప్రతి 100 మంది కస్టమర్లలో 68 మంది పెద్ద కార్లనే ఎంచుకుంటున్నారు. కేవలం మూడు నెలల్లోనే 8,61,918 ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 29 శాతం ఎక్కువ. మరోవైపు హ్యాచ్‌బ్యాక్, సెడాన్ లాంటి సాధారణ కార్ల అమ్మకాలు కూడా 21 శాతం వృద్ధితో 3,67,549 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2026 సింగిల్ మంత్ సేల్స్ కూడా గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగి 3,88,144 కి చేరాయి.

భారతదేశంలో తయారవుతున్న మేడ్ ఇన్ ఇండియా కార్లకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఈ మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి విదేశాలకు దాదాపు 2.22 లక్షల ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 8.8 శాతం ఎక్కువ వృద్ధిని సూచిస్తోంది. ముఖ్యంగా లాటిన్ అమెరికా, యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో భారతీయ వాహనాలకు ఆదరణ పెరగడమే ఇందుకు కారణం. అయితే, ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, రవాణా ఇబ్బందుల కారణంగా గల్ఫ్ దేశాలకు జరిగే ఎగుమతులపై మాత్రం స్వల్పంగా ప్రభావం పడింది.

ద్విచక్ర వాహనాల మార్కెట్లో కూడా ఈసారి అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య దేశంలో మొత్తం 56.28 లక్షల టూ-వీలర్స్ అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువ. అయితే ఈ విభాగంలో మోటార్ సైకిళ్లతో పోలిస్తే స్కూటర్ల అమ్మకాల వేగం దూసుకుపోయింది. ఈ మూడు నెలల్లో ఏకంగా 21.78 లక్షల స్కూటర్లు అమ్ముడై 31 శాతం బంపర్ గ్రోత్ సాధించాయి. అదే సమయంలో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 33.08 లక్షల యూనిట్లుగా నమోదైనప్పటికీ, వాటి వృద్ధి రేటు కేవలం 14 శాతానికే పరిమితమైంది. గత పండుగ సీజన్లలో ప్రభుత్వం జీఎస్టీ పరంగా కల్పించిన కొన్ని రాయితీలు, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల గేర్లు లేని స్కూటర్ల వైపే జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని సియామ్ ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.

కేవలం కార్లే కాకుండా భారతీయ ద్విచక్ర వాహనాలు కూడా విదేశీ రోడ్లపై జోరుగా పరుగులు తీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశం నుంచి రికార్డు స్థాయిలో 15.5 లక్షల టూ-వీలర్స్ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులలో ఏకంగా 36.6 శాతం భారీ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలతో పాటు, దక్షిణ ఆసియా పొరుగు దేశాలు, ఆఫ్రికా ఖండంలోని మార్కెట్లలో భారతీయ బైకులు, స్కూటర్లకు డిమాండ్ నిలకడగా పెరుగుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story