Maruti Suzuki : స్కూల్ వ్యాన్ నుంచి అంబులెన్స్ వరకు.. అన్నింటికీ ఇదే కేరాఫ్ అడ్రస్

Maruti Suzuki : భారతదేశంలోనే అత్యంత చౌకైన 7 సీటర్ సిఎన్‌జి కారుగా మారుతి ఈకో నిలిచింది. కేవలం రూ. 6.36 లక్షల ధరలోనే 27 కిలోమీటర్ల మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీతో లభిస్తోంది.

CR Reddy
Published on: 22 May 2026 8:50 AM IST
Maruti Eeco
X

Maruti Eeco

Maruti Suzuki : సొంతంగా ఒక పెద్ద కారు కొనుక్కోవాలని, కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా ప్రయాణించాలనేది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల. అయితే బడ్జెట్ భారంగా మారడం, పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో ఒక అద్భుతమైన ఆప్షన్ అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలోనే 7 సీటర్ సదుపాయం, భారీ మైలేజ్ ఇచ్చే సిఎన్‌జి (CNG) మోడల్ కారు ఇప్పుడు భారతీయ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కారును ప్రతి నెలా సగటున 12,000 మందికి పైగా కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేస్తుండటం విశేషం.

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో రెనో ట్రైబర్, నిస్సాన్ గ్రెవైట్ వంటి కార్లు ప్రముఖంగా కనిపిస్తాయి. వీటి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలు 5.65 లక్షల రూపాయల నుంచి మొదలవుతాయి. అలాగే ఈ సెగ్మెంట్‌లో మోస్ట్ పాపులర్ మోడల్ అయిన మారుతి సుజుకి ఎర్టిగా ధర 8.80 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అయితే వీటన్నింటికంటే ఎంతో చౌకగా లభించే కారే మారుతి సుజుకి ఈకో. ఈ కారు బేస్ వేరియంట్ ప్రారంభ ధర కేవలం 5.21 లక్షల రూపాయలు మాత్రమే కాగా, అన్ని ఫీచర్లు ఉన్న టాప్ ఎండ్ సిఎన్‌జి మోడల్ ధర కేవలం రూ.6.36లక్షలు మాత్రమే.

మధ్యతరగతి వారికి కారు కొనేటప్పుడు ధర ఎంత ముఖ్యమో, మైలేజ్ కూడా అంతే ముఖ్యం. మారుతి ఈకో కారులో సరికొత్త కె-సిరీస్ 1.2-లీటర్ అడ్వాన్స్‌డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 80.76 PS పవర్‌ను, 104.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సిఎన్‌జి మోడ్‌కు మారినప్పుడు 71.65 PS పవర్‌ను, 95 Nm టార్క్‌ను అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, దీని కమర్షియల్ వేరియంట్ పెట్రోల్‌పై లీటరుకు 20.2 కిలోమీటర్లు, సిఎన్‌జిపై కేజీకి 27.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సాధారణ ప్యాసింజర్ వేరియంట్ విషయానికి వస్తే, పెట్రోల్‌పై 19.7 కిలోమీటర్లు, సిఎన్‌జిపై 26.78 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ వినియోగదారుల ఇంధన ఖర్చులను భారీగా తగ్గిస్తోంది.

మారుతి ఈకో అనగానే పాతకాలపు వ్యాన్ అని చాలామంది అనుకుంటారు. కానీ కొత్తగా వచ్చిన అప్‌డేటెడ్ మోడల్‌లో కంపెనీ సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన డిజిటల్ సిస్టమ్‌ను జోడించింది. ఇందులో సరికొత్త స్టీరింగ్ వీల్‌తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్లను మారుతి సెలెరియో, ఎస్-ప్రెస్సో కార్ల నుంచి సేకరించడం గమనార్హం. గతంలో ఉన్న పాత స్లైడింగ్ ఏసీ కంట్రోల్స్ స్థానంలో ఇప్పుడు మోడ్రన్ రోటరీ ఏసీ స్విచ్‌లను తీసుకొచ్చారు. ప్రయాణికుల భద్రత కోసం ఈ బడ్జెట్ కారులో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, చైల్డ్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి 11 రకాల అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించారు.

ఈ కారు కేవలం ఫ్యామిలీస్ కోసమే కాకుండా కమర్షియల్ రంగంలో కూడా రారాజుగా వెలుగొందుతోంది. మారుతి ఈకో మొత్తం 4 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లతో పాటు కార్గో (వస్తువుల రవాణా), టూర్ (ట్రావెల్స్), అంబులెన్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ కారు పొడవు 3,675 మిమీ, వెడల్పు 1,475 మిమీ, ఎత్తు 1,825 మిమీగా ఉంటుంది. అంబులెన్స్ మోడల్ ఎత్తు మాత్రం కొద్దిగా ఎక్కువగా 1,930 మిమీ ఉంటుంది. దీని మల్టీ-పర్పస్ డిజైన్ కారణంగా స్కూల్ వ్యాన్‌లుగా, హాస్పిటల్ అవసరాలకు, ప్యాసింజర్ రవాణా వ్యాపారాలకు ఇది దేశంలోనే నంబర్ వన్ ఛాయిస్‌గా నిలిచింది. జూన్ నెల నుంచి మారుతి సుజుకి కార్ల ధరలు దాదాపు 30,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నందున, ఈ కారును సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story