E3 Trion: సింగిల్ ఛార్జ్‌తో 165 కిమీ రేంజ్.. దేశంలోనే ఫస్ట్ ఏఐ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

E3 Trion: బెంగళూరు స్టార్టప్ E3 Electric.AI తొలి ఏఐ మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ E3 Trionను లాంచ్ చేసింది.

CR Reddy
Published on: 7 Aug 2026 9:18 AM IST
E3 Trion
X

E3 Trion

E3 Trion: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ E3 Electric.AI భారత మార్కెట్లోకి అత్యంత ఆధునికమైన E3 ట్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలోనే ఇది తొలి ఏఐ-పావర్డ్ మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ ప్రకటించింది. సాధారణ భారతీయ కుటుంబాలు, రోజువారీ ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం బెంగళూరులో దీని ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, త్వరలోనే దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర దాదాపు రూ.99,999 నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

కంపెనీ ఈ3 ట్రియాన్ స్కూటర్‌ను C1, C1x, C2 అనే మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. బేస్ వేరియంట్ C1 లో 2.3 kWh రిమూవబుల్ బ్యాటరీని అందించారు. దీనిని ఇల్లు లేదా ఆఫీసులో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక C1x, C2 వేరియంట్లలో 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ అమర్చారు. ఇందులో C1x వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 165 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక పర్ఫామెన్స్ లవర్స్ కోసం తయారు చేసిన టాప్ వేరియంట్ C2 గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది కేవలం 6 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు.

ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ దీని ఏఐ బేస్డ్ ప్రిడిక్టివ్ ఇంటిలిజెన్స్ సిస్టమ్. ఇందులో ఉపయోగించిన E3 కమాండ్ సెంటర్ టెక్నాలజీ ప్రయాణ సమయంలో వాహనం కండిషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే ముందే రైడర్‌ను హెచ్చరిస్తుంది. స్కూటర్‌లో 5-అంగుళాల డిస్‌ప్లేతో కూడిన ట్రిప్‌సెన్స్ స్మార్ట్ కాక్‌పిట్ ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌కు సులభంగా కనెక్ట్ అవుతుంది. కేవలం 10 సెకన్లలో స్కూటర్ హెల్త్‌ను చెక్ చేసే AI Healthscan, స్మార్ట్ ట్రిప్ ప్లానర్, లైవ్ నేవిగేషన్, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్, డ్యాష్‌క్యామ్, SOS అసిస్టెన్స్ వంటి 100కి పైగా మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

డిజైన్ విషయానికి వస్తే.. ఈ3 ట్రియాన్ లుక్ అంతరిక్ష పరిశోధన నౌక మార్స్ రోవర్‎ని పోలి ఉంటుంది. భారతీయ రోడ్లపై ఉండే గుంతలు, హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు వీలుగా దీనికి 14-అంగుళాల పెద్ద వీల్స్‌ను అందించారు. ఇవి నగర రోడ్లపైనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి గ్రిప్, బ్యాలెన్స్‌ను ఇస్తాయి. E3 Electric.AI సీఈఓ సంజీవ్ పి. మాట్లాడుతూ.. రేంజ్, భద్రత, నిర్వహణ ఖర్చులపై వినియోగదారుల భయాలను తొలగించడానికే ఈ స్కూటర్‌ను రూపొందించామని తెలిపారు. కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు ఈ స్కూటర్‌పై 8 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు దీర్ఘకాలిక విస్తరించిన వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story