iPhone 17ఐఫోన్ 17 కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్
iPhone 17: కొత్త ఐఫోన్ రాకముందే మార్కెట్లో ఐఫోన్ 17 మోడళ్లకు ఊహించని డిమాండ్ పెరిగింది.
iPhone 17ఐఫోన్ 17 కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్
Apple Phone: యాపిల్ సంస్థ కొత్త ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు, దానికి ముందున్న పాత మోడళ్ల ధరలు తగ్గుతాయి. ఆ తగ్గిన ధరలను అందుకోవడానికి సగటు వినియోగదారులు ఆసక్తి చూపిస్తారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో సీన్ రివర్స్ అయింది. కొత్త సిరీస్ మార్కెట్లోకి రావడానికి ఇంకా కొన్ని వారాల సమయం ఉందనగానే.. మార్కెట్లో ఐఫోన్ 17 మోడళ్లకు ఊహించని రీతిలో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
ప్రస్తుతం ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లతో పాటు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలోనూ ఐఫోన్ 17 మోడళ్లు దొరకడం గగనంగా మారింది. కొత్త మోడల్ రాకముందే పాత మోడల్ కోసం వినియోగదారులు ఇలా ఎగబడటానికి కారణం ఒక భయం.. అదే భవిష్యత్తులో రానున్న భారీ ధరల పెంపు భయం. ఈ మొత్తం హడావుడి వెనుక యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ ఇటీవల చేసిన ఒక సంచలన ప్రకటనే ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో మెమొరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యయం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ మనుగడ సాగించాలంటే రానున్న రోజుల్లో ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని ఆయన హింట్ ఇచ్చారు.
టిమ్‌కుక్ ప్రకటన వచ్చిన వెంటనే యాపిల్ సంస్థ తన ఐప్యాడ్స్, మ్యాక్స్, మ్యాక్‌బుక్స్ వంటి గ్యాడ్జెట్ల ధరలను అమాంతం పెంచేసింది. అయితే, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఐఫోన్ల ధరలను మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా ఉంచింది. యాపిల్ తదుపరి టార్గెట్ ఐఫోన్లేనని టెక్ ప్రియులు త్వరగానే పసిగట్టారు. రానున్న రోజుల్లో ఐఫోన్ 17 సిరీస్ ధరలు కూడా ఎక్కడ భారీగా పెరిగిపోతాయోననే భయంతో వినియోగదారులు అప్రమత్తమయ్యారు. ధరలు పెరిగిన తర్వాత బాధపడేకంటే, ప్రస్తుత ధరలకే ఫోన్‌ను సొంతం చేసుకోవడం ఉత్తమమని భావించారు.
ఈ ఒక్క ఆలోచనతో ఐఫోన్ 17 మోడళ్ల కొనుగోలుకు ఆర్డర్లు వెల్లువలా వచ్చాయి. ఫలితంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ వేదికలతో పాటు, నగరాల్లోని ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఐఫోన్ 17 స్టాక్ క్షణాల్లో ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఔటాఫ్ స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏది ఏమైనా కొత్త మోడల్ రాకముందే పాత మోడల్ మార్కెట్‌ను షేక్ చేయడం ఒక్క యాపిల్ బ్రాండ్‌కే సాధ్యమంటూ టెక్ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఒకవేళ మీరు కూడా ఐఫోన్ 17 సిరీస్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. స్టాక్ ఎప్పుడు వస్తుందా అని ఒక కన్నేసి ఉంచడం మంచిది.




