Jetour T2 : ఒక్కసారి ఫుల్ చేస్తే 1000 కిమీ జర్నీ.. దీపావళికి మార్కెట్లోకి దిగుతున్న బ్రహ్మాస్త్రం
Jetour T2 : భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ మోటార్స్, చెర్రీ సంస్థల భాగస్వామ్యంలో సరికొత్త జెటూర్ టీ2 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ వస్తోంది.
Jetour T2
Jetour T2 : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో రాబోయే దీపావళి పండుగ సీజన్ లో ఒక సరికొత్త, అత్యంత శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ అడుగుపెట్టబోతోంది. ప్రముఖ భారతీయ సంస్థ జేఎస్‌డబ్ల్యూ మోటార్స్, చైనాకు చెందిన ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ చెర్రీ భాగస్వామ్యంలో జెటూర్ టీ2 మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ రెండు సంస్థల కూటమి నుంచి భారత్‌లో విడుదలవుతున్న మొట్టమొదటి మోడల్ ఇదే కావడం విశేషం. ఒకే కారులో ఎలక్ట్రిక్ మైలేజ్, పెట్రోల్ ఇంజన్ పవర్ రెండింటినీ కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ కారును డిజైన్ చేశారు.
మహారాష్ట్ర ప్లాంట్‌లో తయారీ
విశ్వసనీయ నివేదికల ప్రకారం... ఈ జెటూర్ టీ2 హైబ్రిడ్ ఎస్‌యూవీని 2026 దీపావళి పండుగ సమయానికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ కారు అసెంబ్లింగ్ పనులను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ప్లాంట్‌లో చేపట్టనున్నారు. దీనివల్ల కారు ధరను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ప్రారంభంలో ఈ కారును కేవలం 5-సీటర్ ఆప్షన్‌తో మాత్రమే మార్కెట్లోకి తీసుకురానున్నారు. లోపల విశాలమైన స్థలం, ప్రీమియం లుక్‌తో ఈ కారు కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ప్రీమియం కార్ల మార్కెట్లో గట్టి పోటీ
ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో ఈ జెటూర్ టీ2 ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 35 లక్షల రూపాయల నుంచి 45 లక్షల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ధర పరిధిలో నేరుగా దీనికి ఎలాంటి పోటీ లేనప్పటికీ, మార్కెట్లో ఇప్పటికే ఉన్న మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ వంటి ప్రీమియం ఎస్‌యూవీ కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. లగ్జరీ కార్లను ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుతమైన సరికొత్త ప్రత్యామ్నాయంగా మారనుంది.
బుల్లెట్ వేగం.. అదిరిపోయే ఇంజన్ పవర్
భారతదేశంలో విడుదల కాబోయే జెటూర్ టీ2 కారులో అత్యంత ఆధునికమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో 1.5 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్‌తో పాటు, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 26.7 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల ఎల్‌ఎఫ్‌పీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ మొత్తం సెటప్ కలిసి కారుకు 381 బ్రేక్ హార్స్ పవర్, 610 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. దీనివల్ల ఈ కారు కేవలం 7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 197 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది.
మైలేజ్, ఛార్జింగ్ విశేషాలు
ఈ ఎస్‌యూవీకి ఉన్న అతిపెద్ద బలం దీని డ్రైవింగ్ రేంజ్. పెట్రోల్ లేకుండా కేవలం బ్యాటరీ పవర్‌తో మాత్రమే ఈ కారు 139 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇక పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిసి పనిచేసినప్పుడు, ఇది ఏకంగా 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. దీనివల్ల సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు పదే పదే పెట్రోల్ కొట్టించాల్సిన లేదా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ కారు ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. సాధారణ ఏసీ ఛార్జర్ ద్వారా 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుండగా, డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 30% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు.




