ఒక్క చార్జ్‌తో 1000 కిలోమీటర్ల ప్రయాణం.. దీపావళికి పెద్దగానే ప్లాన్ చేసిన జేఎస్‌డబ్ల్యూ..!
JSW Chery Jetour T2 India: భారతీయ వాహన ప్రియుల్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లకు ఆదరణ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ఒక భారీ అడుగు వేసింది.
ఒక్క చార్జ్‌తో 1000 కిలోమీటర్ల ప్రయాణం.. దీపావళికి పెద్దగానే ప్లాన్ చేసిన జేఎస్‌డబ్ల్యూ..!
JSW Chery Jetour T2 India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ మోటార్స్, చైనీస్ కార్ల తయారీ సంస్థ చెరీ భాగస్వామ్యంలో వస్తున్న మొట్టమొదటి ప్రీమియం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ 'జెటూర్ టీ2' ఈ దీపావళికి మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అద్భుతమైన ఫీచర్లు, కళ్లు చెదిరే మైలేజీతో ఈ కారు రాబోతోంది.
భారతీయ వాహన ప్రియుల్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లకు ఆదరణ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ఒక భారీ అడుగు వేసింది. చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ చెరీతో చేతులు కలిపి, దేశీయ మార్కెట్లోకి ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగానే అత్యంత విలాసవంతమైన, శక్తివంతమైన "జెటూర్ టీ2" (Jetour T2) ఎస్‌యూవీని 2026 దీపావళి పండుగ కానుకగా లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 5-సీటర్ కాన్ఫిగరేషన్‌తో రానున్న ఈ ప్రీమియం కారును మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు.
ఇంజిన్ పర్ఫార్మెన్స్.. నెక్స్ట్ లెవెల్ పవర్..!
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఎస్‌యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నప్పటికీ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా జేఎస్‌డబ్ల్యూ దీనిని కేవలం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్‌లో మాత్రమే పరిచయం చేస్తోంది. ఈ కారులో శక్తివంతమైన 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి అదనంగా డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, 26.7 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌ను జత చేశారు. ఈ మొత్తం వ్యవస్థ కలిసి ఏకంగా 381 హార్స్ పవర్ శక్తిని, 610 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికొస్తే, ఈ కారు కేవలం 7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 197 కిలోమీటర్లుగా నిర్ధారించారు.
రేంజ్ వింటే షాక్ అవ్వాల్సిందే..!
మైలేజ్ లేదా రేంజ్ విషయంలో అస్సలు రాజీపడకూడదు అనుకునే వారికి ఈ కారు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం కానుంది. ఈ ఎస్‌యూవీని కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో నడిపితే దాదాపు 139 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే పెట్రోల్ ఇంజిన్, బ్యాటరీ పవర్ రెండింటినీ కలిపి హైబ్రిడ్ మోడ్‌లో ఉపయోగిస్తే, ఒక్కసారి ఫుల్ ట్యాంక్, పూర్తి చార్జింగ్‌తో ఏకంగా 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ గర్వంగా చెబుతోంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో కలిసివచ్చే అంశం.
చార్జింగ్ కూడా చాలా వేగంగా..
ఈ కారు బ్యాటరీ సాధారణ హోమ్ ఏసీ చార్జర్ తో పాటు డీసీ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో ఉండే సాధారణ ఏసీ చార్జర్ ద్వారా కేవలం 4 గంటల లోపే 30 శాతం నుంచి 100 శాతానికి బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రయాణాల్లో ఉండి డీసీ ఫాస్ట్ చార్జర్ ఉపయోగిస్తే, కేవలం 30 నిమిషాల్లోనే 30 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది.
లగ్జరీ ఫీచర్లు..
జెటూర్ టీ2 లోపలి భాగం ఒక విలాసవంతమైన ప్రపంచాన్ని తలపిస్తుంది. ఇందులో 15.6 ఇంచుల అతిపెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, సోనీ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. వీటికి తోడు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీ ద్వారా లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ప్రయాణీకులకు కొండంత అండగా నిలుస్తాయి.
ధర ఎంత ఉండొచ్చు? పోటీ ఎవరితో?
పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లోకి రానున్న ఈ ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉండవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ తరహా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెగ్మెంట్లో దీనికి నేరుగా పోటీ ఇచ్చే కార్లు ఏవీ లేవు. అయినప్పటికీ, దీని ధర, లగ్జరీ ఫీచర్ల ఆధారంగా మార్కెట్లో ఉన్న మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్ వంటి పాపులర్ మోడళ్లకు జెటూర్ టీ2 గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
జేఎస్‌డబ్ల్యూ, చెరీల కలయికలో వస్తున్న జెటూర్ టీ2, భారతీయ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, విలాసవంతమైన ఇంటీరియర్, అన్నింటికీ మించి 1000 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్ ఈ కారును ప్రీమియం లవర్స్ కు హాట్ ఛాయిస్ గా మార్చనున్నాయి. రాబోయే పండుగ సీజన్ లో ఈ బ్రహ్మాస్త్రం భారత రోడ్లపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.




