Kia: పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో కియా కారెన్స్ క్లావిస్ కొత్త మోడల్స్ విడుదల.. ధర ఎంతంటే?
Kia: ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందిన 7-సీటర్ కార్ల తయారీదారు కియా ఇండియా మరో అద్భుతమైన అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది.
Kia Carens Clavis
Kia: ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందిన 7-సీటర్ కార్ల తయారీదారు కియా ఇండియా మరో అద్భుతమైన అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. తన ప్రముఖ మోడలైన కారెన్స్ క్లావిస్ ఐసీఈ లైనప్‌లో మూడు కొత్త ఆటోమేటిక్ వేరియంట్లను అధికారికంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కూడా టర్బో-పెట్రోల్ డీసీటీ అలాగే డీజిల్ ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్ తక్కువ ధరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వేరియంట్లు హెచ్‌టీఈ (ఈఎక్స్) అలాగే హెచ్‌టీఈ (ఓ) ట్రిమ్స్‌పై ఆధారపడి రూపుదిద్దుకున్నాయి.
ఈ కొత్త ఆటోమేటిక్ వేరియంట్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.14.67 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గతంలో ఈ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్ కావాలంటే కస్టమర్లు చాలా ఎక్కువ ధర ఉన్న హై-ఎండ్ వేరియంట్లను ఎంచుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తక్కువ ధరల శ్రేణిలోనే ఈ సదుపాయం లభించడం విశేషం. ఈ కార్లను 6-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్ల కోసం కూడా ప్రత్యేకంగా 15 సంవత్సరాల లేదా అన్-లిమిటెడ్ కిలోమీటర్ల హై-వోల్టేజీ బ్యాటరీ వారంటీని ప్రకటించి వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంది.
కొత్తగా ప్రవేశపెట్టిన వేరియంట్లలో ముఖ్యంగా టర్బో-పెట్రోల్ డీసీటీ మోడల్ 1.5-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. హెచ్‌టీఈ (ఓ) 1.5 టర్బో-పెట్రోల్ డీసీటీ వేరియంట్ ధర రూ. 14,66,900గా ఉంది. ఇది మూడు కొత్త ఆటోమేటిక్ వేరియంట్లలో అత్యంత చౌకైనదిగా నిలిచింది. అలాగే హెచ్‌టీఈ (ఈఎక్స్) టర్బో-పెట్రోల్ డీసీటీ వేరియంట్ ధర రూ. 15,21,900గా నిర్ణయించారు. ఈ రెండు వేరియంట్ల మధ్య సుమారు రూ. 55,000 ధర వ్యత్యాసం ఉంది.
ఇది మాత్రమే కాకుండా డీజిల్ ప్రియుల కోసం కూడా కియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన కారెన్స్ క్లావిస్ హెచ్‌టీఈ (ఓ) వేరియంట్ ధర రూ. 15,81,900గా ఉంది. రూ. 15 లక్షల బ్రాకెట్‌లో కారు కొనాలనుకునే వారికి ఇప్పుడు పెట్రోల్ అలాగే డీజిల్ ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌లలో అద్భుతమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. ఈ కొత్త వేరియంట్లన్నింటిలోనూ మోషన్ సెన్సార్లు, పుష్-బటన్ స్టార్ట్, వివిధ డ్రైవ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అలాగే రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.




