Kia: పెట్రోల్ ఖర్చులకు చెక్.. 100% ఇథనాల్‌తో పరిగెత్తే కొత్త కియా కారు వచ్చేసిందోచ్
Kia: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగంగా ప్రోత్సహిస్తున్న తరుణంలో కియా తీసుకొచ్చిన సైరోస్ కార్ టెక్నాలజీ భవిష్యత్తు వాహన రంగానికి మార్గదర్శకంగా నిలవనుంది.
Kia Syros
Kia: భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా తీపి కబురు అందించింది. వంద శాతం ఇథనాల్‌తో నడిచే సరికొత్త సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రదర్శించింది. ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో ఈ మోడల్ సరికొత్త మైలురాయిగా నిలవనుంది. కంపెనీ రూపొందించిన మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనం సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్(FFV) కాన్సెప్ట్ మోడల్‌ను దేశంలో అధికారికంగా ప్రదర్శించింది. సాధారణ పెట్రోల్‌తో పాటు ఏకంగా 100 శాతం ఇథనాల్‌ను కూడా ఇంధనంగా ఉపయోగించుకునేలా ఈ కారును తీర్చిదిద్దడం విశేషం. అంటే కస్టమర్లు తమ సౌకర్యాన్ని బట్టి స్వచ్ఛమైన పెట్రోల్ లేదా పూర్తి ఇథనాల్ లేదంటే రెండింటి మిశ్రమాన్ని ఇందులో నింపుకుని ప్రయాణించవచ్చు. మారుతి సుజుకి తర్వాత భారత్‌లో ఈ తరహా కాన్సెప్ట్ ప్రదర్శించిన రెండో ప్రముఖ సంస్థగా కియా నిలిచింది.
ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ పర్ఫామెన్స్ పరంగా అత్యంత నమ్మకమైన టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇథనాల్ శాతంలో మార్పులు వచ్చినా ఇంజిన్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU), ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్ (TCU) వ్యవస్థలను పూర్తిగా ఆధునీకరించారు. ఇంధన రవాణా వ్యవస్థను సైతం ఇథనాల్ రసాయన ధర్మాలకు తట్టుకునేలా మెరుగుపరిచారు. గేర్‌బాక్స్ విషయంలో కూడా మార్పులు చేసి 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
డిజైన్ విషయంలో కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ సాధారణ సైరోస్ ఎస్‌యూవీని పోలి ఉంటుంది. ఎత్తైన బాక్సీ డిజైన్, అగ్రెసివ్ లుక్‌తో రోడ్డుపై కన్నులపండువగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైటింగ్, రూఫ్ రయిల్స్, స్పోర్టీ శైలిలో ఉండే 17 ఇంచుల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ కేటాయించారు. వెనుక వైపు కియా బ్రాండ్‌కే ప్రత్యేకమైన ఎల్-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్లను అమర్చి కారుకు మరింత ప్రీమియం లుక్ తీసుకువచ్చారు.
కారు లోపలి భాగం అత్యాధునిక వసతులతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. డాష్‌బోర్డ్ భాగంలో కియాకే సొంతమైన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ అందించారు. ఇందులో భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ కంట్రోల్ కోసం ప్రత్యేక డిస్‌ప్లే ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సులభంగా ఆపరేట్ చేయడానికి వీలుగా సెంటర్ కన్సోల్‌పై ముఖ్యమైన ఫిజికల్ బటన్లను కేటాయించడం రైడర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.




