Lamborghini: 343 kmph స్పీడుతో దూసుకెళ్లొచ్చు.. లంబోర్ఘిని నుంచి మరో పవర్‌ఫుల్ కారు

లంబోర్ఘిని కొత్త హైబ్రిడ్ సూపర్ కార్ Temerario Spyderను ఆవిష్కరించింది. 4.0 లీటర్ల ట్విన్ టర్బో V8 ఇంజిన్, మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి 907hp పవర్ అందిస్తుంది.

CR Reddy
Published on: 20 Nov 2026 9:30 AM IST
Lamborghini: 343 kmph స్పీడుతో దూసుకెళ్లొచ్చు.. లంబోర్ఘిని నుంచి మరో పవర్‌ఫుల్ కారు
X

Lamborghini: సూపర్ కార్ లవర్లకు లంబోర్ఘిని మరో అదిరిపోయే మోడల్‌ను పరిచయం చేసింది. తన కొత్త హైబ్రిడ్ సూపర్ కార్ టెమెరారియో స్పైడర్ను ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న టెమెరారియో కూపేకి ఓపెన్‌టాప్ వెర్షన్. పైకప్పును పూర్తిగా మడిచిపెట్టుకునే సదుపాయంతో పాటు శక్తివంతమైన V8 ఇంజిన్, మూడు ఎలక్ట్రిక్ మోటార్లను ఇందులో అందించారు. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 343 కిలోమీటర్లు. నిలిచిన స్థితి నుంచి కేవలం 2.8 సెకన్లలోనే 100 kmph వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత.

లంబోర్ఘిని చరిత్రలో తొలిసారి

టెమెరారియో స్పైడర్లో అందరినీ ఆకట్టుకునే ప్రత్యేకత దాని పైకప్పు. లంబోర్ఘిని తన స్పైడర్ కార్లలో తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్రిక్‌గా పనిచేసే రిట్రాక్టబుల్ హార్డ్‌టాప్‌ను తీసుకొచ్చింది. అంటే అవసరమైనప్పుడు పైకప్పును తెరిచి ఓపెన్‌టాప్ కారులా నడపొచ్చు. మళ్లీ బటన్ నొక్కితే పైకప్పు మూసుకుపోతుంది. పది ఎలక్ట్రిక్ యాక్చుయేటర్ల సాయంతో పనిచేసే ఈ వ్యవస్థను గంటకు సుమారు 49 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడూ తెరవడం, మూయడం చేయొచ్చు. పైకప్పు సీట్ల వెనుక నిలువుగా అమరుతుంది. ఇలా రూపొందించడం వల్ల కారు బరువు సమతుల్యత, హ్యాండ్లింగ్‌పై ప్రభావం తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. వెనుకవైపు ఉండే గ్లాస్‌ను కూడా ఎలక్ట్రానిక్‌గా సర్దుకోవచ్చు. దీని ద్వారా లోపలికి వచ్చే గాలిని, ఇంజిన్ శబ్దాన్ని నియంత్రించుకోవచ్చు.

907hp హైబ్రిడ్ ఇంజిన్.. 800Nm టార్క్

ఈ సూపర్ కారులో 4.0 లీటర్ల ట్విన్ టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి మూడు ఎలక్ట్రిక్ మోటార్లను జత చేశారు. ఒక మోటార్ వెనుక భాగంలో, మరో రెండు ముందు చక్రాల యాక్సిల్‌పై ఉంటాయి. ఈ నాలుగు చక్రాలకు శక్తిని అందించే హైబ్రిడ్ వ్యవస్థ మొత్తం 920 CV (907hp) పవర్, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని V8 ఇంజిన్ ఒక్కటే 789hp పవర్ అందిస్తుంది. సాధారణంగా ఇది 10,000 RPM వరకు తిరుగుతుంది. లాంచ్ కంట్రోల్ ఆన్ చేస్తే 10,250 RPM వరకు వెళ్లగలదు. అంటే వేగంతో పాటు ఇంజిన్ నుంచి వచ్చే శబ్దం కూడా ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

2.8 సెకన్లలో 100 kmph.. టాప్ స్పీడ్ 343 kmph

స్పీడ్ విషయంలో టెమెరారియో స్పైడర్ ఏమాత్రం తగ్గలేదు. నిలిచిన స్థితి నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.8 సెకన్లు పడుతుంది. 200 kmph వేగాన్ని చేరుకోవడానికి 7.3 సెకన్లు సరిపోతాయని లంబోర్ఘిని ప్రకటించింది. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 343 కిలోమీటర్లు. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉంది. ఇందులో 5 డ్రైవింగ్ మోడ్‌లు అందించారు. వీటితో పాటు రీఛార్జ్, హైబ్రిడ్, పర్ఫామెన్స్ అనే మూడు హైబ్రిడ్ సెట్టింగ్‌లు ఉన్నాయి. డ్రైవింగ్ సమయంలో వెనుక చక్రాలు నియంత్రితంగా జారేలా చేసేందుకు మూడు స్థాయిల్లో డ్రిఫ్ట్ మోడ్ కూడా ఇచ్చారు.

క్యాబిన్‌లోనూ ప్రత్యేక సదుపాయాలు

కారు లోపలి భాగంలో ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. Huracan EVO Spyderతో పోలిస్తే ఇందులో కాళ్లు పెట్టుకునే స్థలం 46 మిల్లీమీటర్లు, తల దగ్గర స్థలం 22 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. భుజాలు, మోచేతుల దగ్గర కూడా అదనపు స్థలం కల్పించారు. చల్లటి వాతావరణంలో ఉపయోగపడేలా మూడు స్థాయిల్లో పనిచేసే నెక్ వార్మర్ ఇచ్చారు. ఇది సుమారు 45 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగాలిని అందించగలదు. సస్పెన్షన్‌లో చేసిన మార్పులతో ఎగుడుదిగుడు రోడ్లపై వచ్చే రెండో స్థాయి కంపనాలు 20 శాతం వరకు తగ్గుతాయని కంపెనీ పేర్కొంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

లంబోర్ఘిని ఈ కారును ఇటలీలోని సాంట్ అగాటా బొలోగ్నీస్‌తో పాటు అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన కార్యక్రమాల్లో ఆవిష్కరించింది. 1976లో Silhouette మోడల్‌తో మొదలైన కంపెనీ ఓపెన్‌టాప్ సూపర్ కార్ల ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేయడం విశేషం. అయితే టెమెరారియో స్పైడర్ కు సంబంధించి భారత్‌లో ధర, అమ్మకాల ప్రారంభ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ మోడల్ అమ్మకాలకు అందుబాటులో లేదని పేర్కొంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.