Car Safety: కారు తాళం లోపలే పెట్టి లాక్ చేశారా? కంగారులో ఈ తప్పులు చేయకండి

Car Safety: కారు తాళం లోపలే మరిచిపోయి డోర్ లాక్ అయితే కంగారులో అద్దాలు పగలగొట్టడం, స్క్రూ డ్రైవర్లతో లాక్ తీయడం వంటి తప్పులు చేయకూడదు.

CR Reddy
Published on: 5 Oct 2026 10:10 AM IST
Car Locked Keys
X

Car Locked Keys

Car Safety: హడావుడిలో కొందరు తొందరలో కారు దిగేటప్పుడు కారు తాళం లోపలే మరిచిపోతుంటారు. తాళం చెవి లోపల ఉండగానే డోర్ లాక్ పడిపోతే ఒక్కసారిగా భయం వేయడం సహజం. అయితే ఆ కంగారులో ఎటువంటి ఆలోచన లేకుండా చేసే కొన్ని పనులు కారును తీవ్రంగా పాడుచేయడమే కాకుండా భారీగా ఖర్చు పెట్టిస్తాయి. కారు లాక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షితంగా తాళం తీసే మార్గాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గ్లాస్ పగలగొట్టవద్దు

కారు లాక్ కాగానే చాలామందికి మొదట వచ్చే ఆలోచన విండో గ్లాస్ పగలగొట్టడం. ఇది చాలా ప్రమాదకరమైన పని. అద్దం పగలగొట్టడం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొత్త గ్లాస్ వేయించడం, కారు సీట్లపై పడిన గాజు పెంకులు శుభ్రం చేయించడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అయితే కారు లోపల చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉండి అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప సాధారణ సమయంలో అద్దాలు పగలగొట్టడం సరైన నిర్ణయం కాదు.

పిన్నులు, తీగలతో ట్రై చేస్తే వైరింగ్ గోవిందా

పాతకాలపు పద్ధతుల్లో లాగా స్కేలు, తీగ లేదా స్క్రూ డ్రైవర్ లాక్ హోల్‌లో పెట్టి గెలకడం అస్సలు చేయకూడదు. ఇప్పటి మోడ్రన్ కార్లలో డోర్ లోపలి భాగంలో సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వైరింగ్ వ్యవస్థలు ఉంటాయి. అలా స్క్రూ డ్రైవర్లతో ప్రయత్నించడం వల్ల వైరింగ్ దెబ్బతిని లాకింగ్ సిస్టమ్ పూర్తిగా ఖరాబవుతుంది. చివరకు చిన్న సమస్య కాస్తా పెద్ద రిపేరుగా మారి వేల రూపాయలు వదిలిపోతాయి.

బలాన్ని ఉపయోగించి డోర్లు లాగొద్దు

లాక్ అయిన డోరును గట్టిగా పట్టుకుని లాగడం వల్ల డోర్ హ్యాండిల్ ఊడిరావడం లేదా రబ్బర్ సీలింగ్ పాడవడం జరుగుతుంది. డోర్ ఫ్రేమ్ వంగిపోతే ఆ తర్వాత తలుపు సరిగ్గా పడదు. వర్షం పడినప్పుడు నీరు లోపలికి రావడం, ప్రయాణంలో గాలి శబ్దం రావడం వంటి కొత్త సమస్యలు మొదలవుతాయి. అందుకే ఎంత కోపం వచ్చినా కారుపై మీ బలాన్ని చూపించకూడదు.

స్పేర్ కీ, డిజిటల్ ఫీచర్లు చెక్ చేయండి

ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇంట్లో ఉన్న స్పేర్ కీ (రెండో తాళం) తెప్పించుకోవడం అత్యంత సురక్షితమైన మార్గం. ప్రస్తుతం వస్తున్న కొత్త కార్లకు మొబైల్ యాప్ ద్వారా అన్‌లాక్ చేసే సౌకర్యం, డిజిటల్ కీ ఫీచర్లు ఉంటున్నాయి. మీ కారులో ఈ సదుపాయం ఉందో లేదో ఒకసారి స్మార్ట్‌ఫోన్ ద్వారా చెక్ చేయండి. అలాగే డిక్కీ లేదా మిగిలిన తలుపులు ఏదైనా తెరిచి ఉన్నాయేమో చూడటం మంచిది.

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సహాయం తీసుకోండి

పై మార్గాలు ఏవీ పనిచేయకపోతే కారు కంపెనీకి చెందిన రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) సర్వీస్‌కు ఫోన్ చేయాలి. ఈ సదుపాయం లేకపోతే నమ్మకమైన ఆటో మొబైల్ లాక్‌స్మిత్‌ను కలవడం శ్రేయస్కరం. వారి దగ్గర కారుకు ఎలాంటి నష్టం కలగకుండా లాక్ తీసే ప్రత్యేక పరికరాలు ఉంటాయి. కాస్త ఓపికగా వ్యవహరిస్తే కారు సురక్షితంగా ఉంటుంది, మీ డబ్బు ఆదా అవుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.