Mercedes Benz : భారత్‌లోకి కొత్త మెర్సిడెస్ లగ్జరీ కార్.. జూన్ 15 న లాంచ్.. ధర వింటే ఫ్యూజులు అవుట్
Mercedes Benz : మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త 2026 ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ జూన్ 15న భారత్‌లో విడుదల కానుంది. అధునాతన ఏఐ ఫీచర్లు, హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్న ఈ విలాసవంతమైన కారు ధర రూ.2 కోట్లు దాటే అవకాశం ఉంది.
Mercedes Benz
Mercedes Benz : లగ్జరీ కార్ల ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జర్మనీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తన ఫ్లాగ్షిప్ మోడల్ 2026 ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌ను జూన్ 15న భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అత్యంత విలాసవంతమైన ఈ సెడాన్ కారు, దేశంలోనే మొదటిసారిగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీతో రంగంలోకి దిగుతోంది. మొదట హైబ్రిడ్ వెర్షన్‌ను లాంచ్ చేసి, ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
కొత్త ఎస్-క్లాస్ డిజైన్‌లో కంపెనీ కీలక మార్పులు చేసింది. ముందు భాగంలో ఉండే గ్రిల్ పరిమాణాన్ని 20 శాతం పెంచి, దానికి వెలుగులు చిమ్మే లైటింగ్ ఫ్రేమ్‌ను అమర్చింది. గ్రిల్ లోపల చిన్న చిన్న క్రోమ్ స్టార్ డిజైన్లు కారుకు కొత్త అందాన్ని ఇస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, కారు బోనెట్‌పై ఉండే ఐకానిక్ మెర్సిడెస్ స్టార్ లోగో ఇప్పుడు లైటింగ్‌తో రానుంది. చీకట్లో కూడా ఈ లోగో తళతళలాడుతూ కారు రాజసాన్ని చాటిచెప్పనుంది.
టెక్నాలజీ పరంగా ఈ కారు అద్భుతమని చెప్పాలి. ఇందులో కొత్తగా MB.OS సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇది కేవలం కారును మాత్రమే కాకుండా ఇంజన్, సస్పెన్షన్, లైటింగ్ వంటి అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ కారులో ChatGPT, Gemini, Bing వంటి ఏఐ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు కారుతో నేరుగా మాట్లాడవచ్చు, సందేహాలు అడగవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, పాత ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ తీసేసి కొత్తగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఇచ్చారు.
కారు లోపల అడుగుపెడితే ఏదో మాయా ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. పాత కాలపు చెక్క డ్యాష్బోర్డ్లకు స్వస్తి పలికి, గ్లోసీ బ్లాక్ సూపర్ స్క్రీన్ ప్యానెల్‌ను అమర్చారు. డ్రైవర్, పక్కన కూర్చునే వారికి 12.3 ఇంచుల స్క్రీన్లు ఉండగా, మధ్యలో 14.4 ఇంచుల భారీ టచ్ స్క్రీన్ ఉంటుంది. వీడియో కాలింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ కెమెరాలు కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం 10 కెమెరాలు, 5 రాడార్లు, 12 సెన్సార్లతో కూడిన అడ్వాన్స్డ్ ADAS సిస్టమ్ ఇందులో ఉంది.
ధర ఎంత ఉండొచ్చు?
ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న కారు ధర కూడా అదే రేంజ్లో ఉండబోతోంది. భారత మార్కెట్లో ఈ 2026 ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.2 కోట్ల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. లగ్జరీ ఫీచర్లు, అధునాతన భద్రతా ప్రమాణాలు, ఏఐ ఇంటిగ్రేషన్ వంటి కారణాల వల్ల ఈ కారుకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. జూన్ 15 తర్వాత భారత రోడ్లపై ఈ విలాసవంతమైన కారు చక్కర్లు కొట్టనుంది.




