Mahindra: లాంచ్‌కు ముందే రోడ్డెక్కిన మహీంద్రా కొత్త కారు.. లుక్ చూస్తే లవ్‎లో పడాల్సిందే

Mahindra: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా విజన్ ఎస్ లాంచ్‌కు ముందే రోడ్డుపై టెస్టింగ్ సమయంలో కంటపడింది.

CR Reddy
Published on: 25 Sept 2026 7:47 AM IST
Mahindra Vision S
X

Mahindra Vision S

Mahindra: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా విజన్ ఎస్ లాంచ్‌కు ముందే రోడ్డుపై టెస్టింగ్ సమయంలో కంటపడింది. ఈసారి ఈ కొత్త ఎస్‌యూవీ రాత్రి సమయంలో కెమెరాకు చిక్కింది. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ViTaAutos షేర్ చేసిన ఈ వీడియోలో, ఈ ఎస్‌యూవీ వెనుక భాగపు లైటింగ్ సెటప్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని బట్టి ఈ కొత్త ఎస్‌యూవీలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆకర్షణీయమైన బాక్సీ డిజైన్,టెయిల్ గేట్ స్పైర్ వీల్

రాత్రి సమయంలో రికార్డ్ చేసిన ఈ వీడియోలో విజన్ ఎస్ ఎస్‌యూవీకి సంబంధించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో నిలువుగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, వాటితో పాటు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు కనిపిస్తున్నాయి. టెయిల్ ల్యాంప్స్‌కు పైన రెండు అంచులను కలుపుతూ ఒక ఎల్ఈడీ లైట్ బార్ కూడా ఇవ్వడం దీని లుక్‌ను మరింత పెంచింది. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ టెయిల్ గేట్‌పై స్పైర్ వీల్ కూడా అమర్చబడి ఉంది. దీని బాక్సీ, రగ్గడ్ డిజైన్ చూస్తుంటే మినీ స్కార్పియోను తలపిస్తోంది.

అత్యాధునిక NU-IQ ప్లాట్‌ఫాం, ఇంజిన్ వివరాలు

ఈ కొత్త మహీంద్రా విజన్ ఎస్ ఎస్‌యూవీని కంపెనీ సరికొత్త NU-IQ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఇది ఐసీఈ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ రెండింటినీ సపోర్ట్ చేసే మోడ్యులర్ మోనోకాక్ ప్లాట్‌ఫాం. ఈ కారు పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉండనుంది. ఇక ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లను అందించే అవకాశం ఉంది. ఇవి మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానున్నాయి. కొన్ని వేరియంట్లలో ఏడబ్ల్యూడీ ఆప్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది.

అదిరిపోయే ఫీచర్లు, లాంచ్ వివరాలు

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ ఎస్‌యూవీలో లెవల్-2 ఏడీఏఎస్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి హై-ఎండ్ ఫీచర్లు లభించే అవకాశం ఉంది. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించేందుకు వస్తున్న ఈ విజన్ ఎస్ త్వరలోనే అధికారికంగా లాంచ్ కానుండగా, ఆటోమొబైల్ మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్, అధునాతన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ మహీంద్రా విజన్ S ఎస్‌యూవీ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.