Mahindra: మహీంద్రా ధమాకా..జూన్ 2027 నాటికి 3 సరికొత్త కార్ల ఎంట్రీ
భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా జూన్ 2027 నాటికి దేశీయ మార్కెట్లోకి మూడు సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Mahindra Vision S
Mahindra: భారతీయ రోడ్లపై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా కౌంట్‌డౌన్ ప్రారంభించింది. జూన్ 2027 నాటికి దేశీయ మార్కెట్లోకి మూడు సరికొత్త పవర్ఫుల్ మోడళ్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. రెండవ త్రైమాసికం ఆర్థిక ఫలితాల మీడియా సమావేశంలో మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజూరికర్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2027 ప్రథమార్ధంలో మొత్తం ఐదు పెద్ద వాహనాల లాంచ్‌లు ప్లాన్ చేయగా, అందులో మూడు వాహనాలు వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ఎస్యూవీ డిజైన్‌లో విజన్ s
మహీంద్రా రూపొందిస్తున్న కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌పై మొదటి వాహనంగా విషన్ S కాన్సెప్ట్ ప్రొడక్షన్ మోడల్ రాబోతోంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏమిటంటే దీనిపై పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ నాలుగు రకాల వేరియంట్లను తయారు చేయవచ్చు. ఈ కారు బాక్సీ డిజైన్‌తో పాటు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్ కలిగి ఉంటుంది. కేబిన్ లోపల 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో XUV 3XO మోడల్ కంటే పైన ఈ SUV నిలవనుంది.
ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్‌తో మహీంద్రా BE 07
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా ఈవీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా 'BE 07' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. కంపెనీ 'BE' సబ్-బ్రాండ్‌లో ఇది రెండవ మోడల్‌గా రానుంది. INGLO ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే ఈ కారులో 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. కేబిన్‌లో ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్, గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, డాష్‌క్యామ్, లెవెల్ 2 ADAS వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు అందించనున్నారు.
స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ఎంట్రీ
లైఫ్‌స్టైల్ పికప్ వాహనాలను ఇష్టపడే వారి కోసం మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ మోడల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది 2023లో ప్రదర్శించిన గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ ఆధారంగా తయారవుతుంది. స్కార్పియో N కి చెందిన బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌ను దీనికి వాడనున్నారు. ఈ పికప్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.79 లక్షల కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇందులో 175hp డీజిల్, 203hp టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు 4-వీల్ డ్రైవ్ వెసులుబాటు కూడా ఉంటుంది.
ఉత్పత్తి సామర్థ్యం పెంపు
కొత్త మోడళ్లకు మార్కెట్లో వస్తున్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని మహీంద్రా తమ తయారీ సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం నెలకు 68,000 యూనిట్లుగా ఉన్న ఎస్యూవీ, ఈవీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2027 నాటికి నెలకు 82,000 యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 70,000 పెట్రోల్/డీజిల్ ఎస్‌యూవీలు, 12,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.




