Mahindra Scorpio-N : వచ్చే నెలలోనే గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైన SUV.. దీనికోసం చాలా మంది వెయిటింగ్
Mahindra Scorpio-N : భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా స్కార్పియో-ఎన్ త్వరలోనే కొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో రాబోతోంది.
Mahindra Scorpio-N
Mahindra Scorpio-N : భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్ అత్యంత పాపులర్ అయిన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. దాని పవర్‌ఫుల్ డిజైన్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ రోడ్ ప్రజెన్స్ కారణంగా ఎంతో కాలంగా వాహనదారుల తొలి ఎంపికగా మారుతోంది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మహీంద్రా సంస్థ త్వరలోనే దీని ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. వచ్చే నెలలోనే కంపెనీ ఈ సరికొత్త ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అత్యంత కొత్తగా ఎక్స్‌టీరియర్ లుక్, డిజైన్
రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్లో పలు కీలక మార్పులు ఉండనున్నాయి. దీని ముందు భాగంలో కొత్త ఫ్రంట్ గ్రిల్, మరింత ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఆకర్షణీయమైన డిఆర్‌ఎల్‌లు రాబోతున్నాయి. వీటితో పాటు సరికొత్త డిజైన్ కలిగిన ఫ్రంట్, రియర్ బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఈ కారుకు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లలో కూడా స్వల్ప మార్పులు చేయనున్నారు. స్కార్పియో బ్రాండ్‌కు ఉన్న పవర్‌ఫుల్, రఫ్ అండ్ టఫ్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, మరింత మోడర్న్ మరియు ప్రీమియంగా కనిపించేలా కంపెనీ దీనిని డిజైన్ చేస్తోంది.
హైటెక్ ఫీచర్లు, ప్రీమియం కేబిన్,సెక్యూరిటీ
కారు ఇంటీరియర్ విషయానికొస్తే.. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షన్ మునుపటి కంటే చాలా హైటెక్‌గా మారనుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా మెరుగైన క్వాలిటీ మెటీరియల్స్, కొత్త డాష్‌బోర్డ్ డిజైన్‌తో ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించనుంది. సేఫ్టీ పరంగా ఇందులో లెవెల్-2 ADAS టెక్నాలజీని అందించే అవకాశముంది. దీని ద్వారా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, TPMS, హిల్ హోల్డ్ కంట్రోల్ లభించనున్నాయి.
పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, అంచనా ధర
స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్‌లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుత మోడల్‌లోని 2.0-లీటర్ mStallion టర్బో పెట్రోల్, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌లనే ఇందులో కొనసాగించనున్నారు. ఈ రెండు ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానున్నాయి. వీటితో పాటు నిర్దిష్ట వేరియంట్లలో 4X4 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇక ధర విషయానికొస్తే కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుత మోడల్ కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు రూ.13.8 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ దాదాపు రూ.25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే లాంచ్ తేదీ, ఫీచర్లు, ధరలపై మహీంద్రా నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




