Mahindra: మహీంద్రా అంటే ఈ ఎస్‌యూవీనే.. బొలెరో, థార్, XUV 3XO కాదు

మహీంద్రా అక్టోబర్ 2026 అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. కంపెనీ మొత్తం 73,338 ఎస్‌యూవీలను విక్రయించి రికార్డు సృష్టించింది.

CR Reddy
Published on: 13 Nov 2026 11:15 AM IST
Mahindra: మహీంద్రా అంటే ఈ ఎస్‌యూవీనే.. బొలెరో, థార్, XUV 3XO కాదు
X

Mahindra: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా ఎస్‌యూవీలకు మంచి ఆదరణ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ కంపెనీ కొత్త మోడళ్లను తీసుకొస్తూ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. అయితే అక్టోబర్ 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే మహీంద్రా దగ్గర ఇప్పటికీ ఒక మోడల్‌దే పైచేయి అని తెలుస్తోంది. బొలెరో, థార్, XUV 3XO, XEV 9S వంటి మోడళ్లను వెనక్కి నెట్టి స్కార్పియో మొదటి స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో ఈ మోడల్‌కు సంబంధించిన స్కార్పియో శ్రేణి మొత్తం 19,353 యూనిట్లు అమ్ముడైంది. అదే నెలలో కంపెనీ దేశీయంగా రికార్డు స్థాయిలో 73,338 యుటిలిటీ వాహనాలను విక్రయించింది.

స్కార్పియో టాప్..తర్వాతి స్థానాల్లో బొలెరో, థార్

అక్టోబర్ 2026లో మహీంద్రా స్కార్పియో శ్రేణి 19,353 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే 12 శాతం వృద్ధి నమోదైంది. రెండో స్థానంలో బొలెరో నిలిచింది. ఈ మోడల్ 12,348 యూనిట్లు అమ్ముడైంది. అయితే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 14 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే మాత్రం 27 శాతం పెరిగాయి. ఇక థార్ 11,956 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 1 శాతం తగ్గినా, నెలవారీగా 33 శాతం వృద్ధి నమోదైంది.

10 వేల మార్క్ దాటిన XUV 3XO, XUV 7XO

మహీంద్రా XUV 3XO అక్టోబర్‌లో 10,828 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 12 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే దాదాపు మార్పు లేదు. మరోవైపు XUV 7XO 10,254 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మోడల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 1 శాతం పెరగగా, నెలవారీగా 13 శాతం వృద్ధి నమోదైంది. ఇలా స్కార్పియో, బొలెరో, థార్, XUV 3XO, XUV 7XO.. ఈ ఐదు మోడళ్లు కలిపి ఒక్క నెలలోనే 64,739 యూనిట్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా ఎస్‌యూవీ అమ్మకాల్లో ఈ మోడళ్ల ప్రాధాన్యం ఎంత ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఎలక్ట్రిక్ కార్లలో XEV 9S ముందంజ

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా కొత్త మోడళ్లకు కూడా ఆదరణ లభిస్తోంది. అక్టోబర్‌లో XEV 9S మొత్తం 4,865 యూనిట్లు అమ్ముడై కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో ముందంజలో నిలిచింది. సెప్టెంబర్‌తో పోలిస్తే దీని అమ్మకాలు 5 శాతం పెరిగాయి. XEV 9e విషయానికి వస్తే 1,941 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 28 శాతం తగ్గగా, నెలవారీగా 2 శాతం తగ్గుదల నమోదైంది. BE 6 మొత్తం 1,717 యూనిట్లు అమ్ముడైంది. ఏడాది ప్రాతిపదికన 20 శాతం తగ్గినా, సెప్టెంబర్‌తో పోలిస్తే 13 శాతం వృద్ధి సాధించింది. XUV400 మాత్రం 76 యూనిట్లకే పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 50 శాతం తగ్గాయి.

మొత్తం 73,338 ఎస్‌యూవీలు

మహీంద్రా అక్టోబర్‌లో దేశీయంగా మొత్తం 73,338 యుటిలిటీ వాహనాలను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 71,624 యూనిట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి సాధించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాలు 14 శాతం పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక నెలవారీ దేశీయ ఎస్‌యూవీ అమ్మకాలుగా మహీంద్రా ప్రకటించింది. ఎగుమతులు సహా అన్ని విభాగాలను కలిపి చూస్తే అక్టోబర్‌లో మొత్తం 1,31,109 వాహనాలు విక్రయించింది. ఇందులో వాణిజ్య వాహనాలు, త్రిచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త మోడళ్లు వచ్చినా, మహీంద్రా అమ్మకాలకు స్కార్పియో ఇప్పటికీ ప్రధాన బలంగా నిలుస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.