Mahindra: ఇండియన్ రోడ్లపై మహీంద్రా హవా.. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న 3 కొత్త కార్లు
Mahindra: భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఆఫ్-రోడింగ్ ప్రేమికులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైంది.
Mahindra
Mahindra: భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఆఫ్-రోడింగ్ ప్రేమికులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైంది. మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు 3 సరికొత్త 4x4, ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి ప్రణాళికలు నిరూపించింది. కొత్త థార్ ఫేస్‌లిఫ్ట్, విషన్ ఎస్, స్కార్పియో లైఫ్‌స్టైలర్ పేరుతో రాబోతున్న ఈ బాహుబలి కార్లు ఆటో వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఆఫ్-రోడ్ వాహనం థార్‌ను మహీంద్రా మరింత ఆధునిక రూపంలో తీర్చిదిద్దుతోంది. నూతన థార్ ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ను మార్చడంతో పాటు థార్ రాక్స్ తరహాలో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, కొత్త రకం టెయిల్ ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌ను జతచేస్తున్నారు. కేబిన్ లోపల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ADAS వంటి భద్రతా ఫీచర్లను జోడించనున్నారు. 2.0-లీటర్ పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు శక్తివంతమైన 4x4 టెక్నాలజీ యథావిధిగా కొనసాగనుంది.
సరికొత్త వేదికపై మహీంద్రా విషన్ ఎస్
సబ్-4-మీటర్ ఎస్‌యూవీ విభాగాన్ని ఊపేసేందుకు మహీంద్రా విషన్ ఎస్ అనే సరికొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. కంపెనీ రూపొందించిన సరికొత్త NU-IQ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారు ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, పెద్ద సైజు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, లేదరెట్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉండనున్నాయి. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో రాబోతున్న ఈ కారు కొన్ని ప్రత్యేక వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ సదుపాయంతో లభించడం విశేషం.
లైఫ్‌స్టైల్ పిక్-అప్ ట్రక్ స్కార్పియో లైఫ్‌స్టైలర్
స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫారమ్‌ను ఆధారంగా చేసుకుని మహీంద్రా ఒక మొరటు లైఫ్‌స్టైల్ పిక్‌అప్ ట్రక్‌ను రూపొందిస్తోంది. దీనికి 'స్కార్పియో లైఫ్‌స్టైలర్' అని నామకరణం చేశారు. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, L-షేప్ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, 18-అంగుళాల భారీ వీల్స్, రగ్గడ్ బాడీ క్లాడింగ్‌తో ఈ కారు రోడ్డుపై రాజసం ఒలకబోయనుంది. అంతర్భాగంలో నిలువుగా ఉండే పెద్ద టచ్‌స్క్రీన్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్ పొందుపరిచారు. 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లతో పాటు 2WD, 4x4 ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ విభాగాల్లో అత్యధిక 4x4 వాహనాలను అందిస్తున్న ఏకైక స్వదేశీ సంస్థగా మహీంద్రా తన పట్టును మరింత బిగిస్తోంది. రాబోయే ఈ మూడు బాహుబలి ఎస్‌యూవీలు ఆఫ్-రోడింగ్ ప్రేమికులకు అసలైన థ్రిల్‌ను పంచడం ఖాయంగా కనిపిస్తోంది.




