Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి తొలి సీఎన్‌జీ కారు.. XUV 3XO కొత్త మోడల్ స్పెషాలిటీ ఇదే

Mahindra XUV 3XO: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు విపరీతమైన క్రేజ్ ఉంది.

CR Reddy
Published on: 14 Oct 2026 11:08 AM IST
Mahindra XUV 3XO CNG
X

Mahindra XUV 3XO CNG

Mahindra XUV 3XO: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా తన మొదటి సీఎన్‌జీ కారును లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో అంచనాలు పెంచిన కంపెనీ తాజాగా తన పాపులర్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ XUV 3XO CNG మోడల్‌కు సంబంధించిన ఫొటోలను బయటపెట్టింది. ఈ కారుకి సంబంధించిన ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వివరాలు ఇప్పుడు ఆటో మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ కారులో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ ఏమిటంటే బూట్ ఫ్లోర్ కింద అమర్చిన డ్యుయల్ సీఎన్‌జీ సిలిండర్లు. రెండు సిలిండర్లు పక్కపక్కనే ఉండి మెటల్ స్ట్రాప్స్‌తో అత్యంత సురక్షితంగా ఫిక్స్ చేయబడి ఉన్నాయి. సాధారణంగా సింగిల్ సిలిండర్ కారులో లగేజ్ పెట్టుకోవడానికి పెద్దగా స్థలం ఉండదు. కానీ టాటా నెక్సాన్ ఐ-సీఎన్‌జీ మాదిరిగానే ఇందులోనూ డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీ వాడటం వల్ల సిలిండర్లపైన కూడా తగినంత లగేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది.

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే.. డ్రైవర్ వైపు ఏసీ వెంట్ కింద హెడ్‌ల్యాంప్ లెవెలింగ్ కంట్రోల్ పక్కన ఒక ప్రత్యేకమైన సీఎన్‌జీ/పెట్రోల్ బటన్‌ను ఇచ్చారు. ఈ బటన్ సహాయంతో డ్రైవర్ ప్రయాణం చేస్తున్న సమయంలోనే సులభంగా పెట్రోల్ నుంచి సీఎన్‌జీకి లేదా సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు మార్చుకోవచ్చు. కేబిన్ లోపల గ్లాస్-బ్లాక్ ఫినిషింగ్, ఆకర్షణీయమైన డాష్‌బోర్డ్ డిజైన్ రెగ్యులర్ పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉన్నాయి.

డిజైన్ పరంగా ఈ సీఎన్‌జీ వేరియంట్ సాధారణ మోడల్‌ను పోలి ఉంటుంది. డ్యుయల్-టోన్ అలాయ్ వీల్స్, ఓఆర్వీఎంలపై టర్న్ ఇండికేటర్లు, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్, డీఆర్‌ఎల్ సెటప్ ఇందులో కనిపిస్తున్నాయి. మహీంద్రాఈ కారులో సింగిల్-పెన్ సన్‌రూఫ్‌తో పాటు కొన్ని వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఉంది. దీనివల్ల ఫీచర్ల పరంగా ఇది కస్టమర్లను మరింత ఆకట్టుకోనుంది.

ఈ కారులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఎంపీఎఫ్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనున్నారు. పెట్రోల్ మోడ్‌లో ఇది సుమారు 110 బీహెచ్‌పీ పవర్‌ను, 200 ఎన్ఎం టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో మైలేజ్ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడ కానప్పటికీ, కిలోకు దాదాపు 28 నుంచి 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో ఇది టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ, మారుతి బ్రెజా సీఎన్‌జీ కార్లతో గట్టి పోటీ పడనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.