Mahindra XUV 3XO: చరిత్ర సృష్టించిన మహీంద్రా XUV 3XO.. రెండేళ్లలోనే 2.5 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డ్
Mahindra XUV 3XO: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో దేశీయ దిగ్గజ ఆటో తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మరో అరుదైన ఘనతను సాధించింది.
Mahindra XUV 3XO
Mahindra XUV 3XO: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో దేశీయ దిగ్గజ ఆటో తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మరో అరుదైన ఘనతను సాధించింది. కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తీసుకువచ్చిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా XUV 3XO సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ కారు అంచనాలకు మించి రాణించి, సరికొత్త మైలురాయిని అందుకుంది. కేవలం రెండన్నర సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే ఏకంగా 2.5 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాల రికార్డును దాటేసి దూసుకుపోతోంది. మహీంద్రా చరిత్రలోనే ఇంత వేగంగా ఈ భారీ సేల్స్ మార్క్‌ను అందుకున్న తొలి ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం.
ఈ కారు సాధించిన ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం దీని ఆకర్షణీయమైన డిజైన్, అందుబాటు ధరలో లభించే ప్రీమియం ఫీచర్లే అని చెప్పవచ్చు. XUV 3XO ముందు భాగంలో ఇచ్చిన కొత్త గ్రిల్, C-షేప్ DRLs, LED హెడ్‌లైట్లు దీనికి ఒక బోల్డ్, మస్క్యులర్ లుక్‌ను ఇస్తున్నాయి. అలాగే వెనుక వైపు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు కారుకు మోడర్న్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. కేబిన్ లోపల 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా అందించిన పనోరమిక్ సన్‌రూఫ్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.
ఇక సేఫ్టీ పరంగా ఈ ఎస్‌యూవీకి సాటి ఎవరు లేరనే చెప్పాలి. భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ప్రయాణికుల రక్షణ కోసం ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా హై-ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దీని కొనుగోలుకు అమితాసక్తి చూపుతున్నారు.
పవర్ట్రైన్ విషయానికి వస్తే.. ఈ కారులో పవర్ఫుల్ మూడు ఇంజిన్ ఆప్షన్లు లభిస్తున్నాయి. రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్లు సిటీలోనూ, హైవేపై అద్భుతమైన పికప్‌ను ఇస్తాయి. అలాగే సుదీర్ఘ ప్రయాణాలకు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లు 18 నుంచి 20 కిమీ/లీటర్, డీజిల్ వేరియంట్లు 20 నుంచి 21.2 కిమీ/లీటర్ వరకు మైలేజీని అందిస్తాయి. ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.79 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ. 15.04 లక్షల వరకు ఉండటంతో, బడ్జెట్ ఫ్రెండ్లీగా కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.




