Mahindra: మహీంద్రా కస్టమర్లకు పండగ ముందే వచ్చేసింది.. పాపులర్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్
Mahindra: భారతదేశపు అగ్రగామి వాహన తయారీ సంస్థ మహీంద్రా సెప్టెంబర్ నెలలో తన పాపులర్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది.
Mahindra XUV 3XO
Mahindra: భారతదేశపు అగ్రగామి వాహన తయారీ సంస్థ మహీంద్రా సెప్టెంబర్ నెలలో తన పాపులర్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యంత ఆదరణ పొందిన కంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్ఓవీ 3ఎక్స్ఓ మోడల్‌పై ఏకంగా రూ.60,000 వరకు తగ్గింపు లభిస్తుండటంతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశంగా మారింది. పండగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వాహన ప్రియులకు మహీంద్రా శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలలో మహీంద్రా ఎక్స్ఓవీ 3ఎక్స్ఓ కొనుగోలు చేసే కస్టమర్లు రూ.60,000 వరకు లబ్ధి పొందవచ్చు. ఈ మొత్తం ఆఫర్‌లో రూ.50,000 నేరుగా క్యాష్ డిస్కౌంట్ రూపంలో లభిస్తుండగా, మిగిలిన మొత్తం కార్పొరేట్, ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాల కింద లభిస్తుంది. అయితే వేరియంట్, రంగు ఆధారంగా ఈ తగ్గింపు మారే అవకాశం ఉన్నందున వివరాల కోసం దగ్గరలోని షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.
ప్రీమియం లుక్.. అద్భుతమైన ఇంటీరియర్
మహీంద్రా ఎక్స్ఓవీ 3ఎక్స్ఓ డిజైన్ పరంగా రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనా తిరిగి చూసేలా చాలా బోల్డ్‌గా ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన కొత్త గ్రిల్, సి-షేప్ ఎల్‌ఈడీ డిఆర్ఎల్‌లు, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు వాహనానికి విలక్షణమైన రూపాన్ని ఇస్తాయి. కారు లోపల 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సాఫ్ట్ టచ్ డాష్‌బోర్డ్ అమర్చారు. ఈ విభాగంలోనే మొదటిసారిగా అందించిన పనోరమిక్ సన్‌రూఫ్ ప్రయాణాన్ని అత్యంత లగ్జరీగా మారుస్తుంది.
సురక్షిత ప్రయాణానికి 5-స్టార్ భరోసా
భద్రత విషయంలో ఈ వాహనం ఏమాత్రం రాజీ పడదు. భారత్ ఎన్‌క్యాప్ సేఫ్టీ క్రష్ టెస్టుల్లో ఇది పూర్తి 5-స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఇందులో ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, ఈఎస్పీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు లభిస్తాయి. అడ్వాన్స్‌డ్ వేరియంట్లలో 360 డిగ్రీల కెమెరాతో పాటు ప్రమాదాలను ముందుగానే ఊహించే లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీ సేఫ్టీని మరింత పెంచుతుంది.
పవర్ఫుల్ ఇంజిన్.. మెరుగైన మైలేజ్
డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగ్గా మార్చడానికి ఇందులో రెండు టర్బో-పెట్రోల్, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ నగరాల్లో, హైవేలపై వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. లీటరుకు పెట్రోల్ వేరియంట్లు 18 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, డీజిల్ వేరియంట్ 20 నుంచి 21.2 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.49 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్ ధర రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.




