Mahindra: సేఫ్టీలో అదుర్స్.. భారత్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి మహీంద్రా కొత్త ఎస్యూవీ
Mahindra: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా సంస్థకు చెందిన కొత్త 3-రో ఎస్యూవీ XUV 7XO సేఫ్టీ విషయంలో మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది.
Mahindra
Mahindra: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా సంస్థకు చెందిన కొత్త 3-రో ఎస్యూవీ XUV 7XO సేఫ్టీ విషయంలో మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఇటీవల నిర్వహించిన భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ ఎస్యూవీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ రేటింగ్ ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లకు కూడా వర్తిస్తుంది. కుటుంబ సభ్యుల రక్షణ కోసం కొనుగోలు చేసే వారికి ఈ కారు మరింత నమ్మకమైన ఎంపికగా నిలుస్తోంది.
భారత్ NCAP నిర్వహించిన ఈ క్రాష్ టెస్ట్ సమయంలో XUV 7XO బరువు 2,059 కిలోలుగా ఉంది. టెస్టింగ్ కోసం AX7 డీజిల్ 2WD 7-సీటర్ ఆటోమేటిక్, AX7L డీజిల్ 4WD 7-సీటర్ ఆటోమేటిక్ వేరియంట్లను ఉపయోగించారు. ఈ టెస్ట్‌లో పెద్దల భద్రత విభాగంలో XUV 7XO ఏకంగా 32కి గాను 30.76 మార్కులు సాధించింది. ముఖ్యంగా ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 14.76 మార్కులు, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఏకంగా 16కి 16 పూర్తి మార్కులు సాధించడం విశేషం. అలాగే సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లోనూ ఈ కారు అత్యుత్తమ ఫలితాలను రాబట్టింది.
కేవలం పెద్దలకే కాకుండా, చిన్న పిల్లల భద్రత విషయంలోనూ ఈ ఎస్యూవీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో XUV 7XO మొత్తం 49 మార్కులకు గాను 44.97 మార్కులు సాధించింది. ఇందులో డైనమిక్ అసెస్మెంట్లో 24కి 23.97 మార్కులు, సీఆర్ఎస్ ఇన్‌స్టాలేషన్‌లో పూర్తిస్థాయిలో 12/12 మార్కులు లభించాయి. టెస్టింగ్ సమయంలో 18 నెలలు, 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల రక్షణ కోసం బ్రిటాక్స్ రోమర్ చైల్డ్ సీట్లను ఉపయోగించి క్రాష్ టెస్ట్ నిర్వహించగా, అన్ని పరీక్షల్లోనూ ఈ కారు పిల్లలకు అత్యుత్తమ రక్షణను అందిస్తుందని నిరూపితమైంది.
భారత్ NCAP ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. XUV 7XO అన్ని వేరియంట్లలోనూ రక్షణకు సంబంధించిన అధునాతన ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, పాదచారుల భద్రత, సీటు-బెల్ట్ రిమైండర్ వంటి ముఖ్యమైన ఫీచర్లు అన్నీ బేస్ వేరియంట్ నుంచి లభిస్తాయి. AX3, AX5, AX7, AX7T, AX7L వంటి వివిధ వేరియంట్లలో లభించే ఈ కారును 6, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయవచ్చు.




