New 7 Seater SUVs : మహీంద్రా XUV 7XOకు చెక్.. మార్కెట్లోకి దూసుకొస్తున్న 3 పవర్‌ఫుల్ 7-సీటర్ ఎస్‌యూవీలు

New 7 Seater SUVs : మహీంద్రా XUV 7XO కి పోటీగా మారుతీ, టయోటా, ఎంజీ నుంచి కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలు రాబోతున్నాయి. వీటి ధరలు, ఫీచర్లు, లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 8 May 2026 9:08 AM IST
MG Starlight 560
X

MG Starlight 560

New 7 Seater SUVs : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ముఖ్యంగా 7-సీటర్ ప్రీమియం విభాగంలో మహీంద్రా XUV 7XO (XUV 700) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే ఈ మొనగాడికి ముకుతాడు వేసేందుకు దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకీ, టయోటా, ఎంజీ మోటార్స్ సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి రానున్న మూడు పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు మహీంద్రాకు గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మారుతీ నుంచి ప్రీమియం 7-సీటర్ (Y17)

భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ, ఇప్పుడు ప్రీమియం 7-సీటర్ విభాగంలోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్ ఆధారంగా Y17 అనే కోడ్ నేమ్‌తో ఒక కొత్త ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఇది గ్రాండ్ విటారా కంటే పొడవుగా ఉండటమే కాకుండా, లోపల ఎక్కువ కేబిన్ స్పేస్ కలిగి ఉంటుంది. ఈ కారులో ఈ-విటారా నుంచి తీసుకున్న కొన్ని అత్యాధునిక డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం. మధ్యతరగతి, ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకునేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లను అందించడం మారుతీ వ్యూహం.

టయోటా హైరైడర్ 7-సీటర్ వేరియంట్

మారుతీకి తోడుగా టయోటా కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన హైరైడర్‎కు 7-సీటర్ వేరియంట్‌ను తీసుకురాబోతోంది. ఇటీవల దీని టెస్ట్ మోడల్‌ను రోడ్లపై గమనించారు. ఇందులో ఆల్‌గ్రిప్ (AWD) డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీలో 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉండనుంది. మైలేజీతో పాటు లగ్జరీని కోరుకునే వారికి టయోటా హైరైడర్ 7-సీటర్ ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.

ఎంజీ నుంచి స్టార్‌లైట్ 560 (PHEV)

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఒక అడుగు ముందుకేసి, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్‌ను పరిచయం చేయనుంది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న వూలింగ్ స్టార్‌లైట్ 560 కి ఇది రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ ఎస్‌యూవీలో క్లోజ్డ్ గ్రిల్, ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్లు, స్టైలిష్ అలాయ్ వీల్స్ ఉండబోతున్నాయి. దీపావళి 2026 నాటికి ఇది భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం హైబ్రిడ్ మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్స్‌యూవీ 7XO లో లేని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎంజీకి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

మహీంద్రాకు ఎందుకు టెన్షన్?

ప్రస్తుతం మహీంద్రా XUV 7XO కు టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి కార్లు పోటీగా ఉన్నాయి. అయితే, మారుతీ, టయోటా వంటి నమ్మకమైన బ్రాండ్ల నుంచి 7-సీటర్ ఎస్‌యూవీలు వస్తుండటంతో కస్టమర్ల ఎంపిక మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ, మెరుగైన మైలేజీ కారణంగా మారుతీ, టయోటా కార్లు మహీంద్రా మార్కెట్ వాటాను తగ్గించే ప్రమాదం ఉంది. ఈ పోటీని ఎదుర్కోవడానికి మహీంద్రా తన ఫీచర్లను మరింత అప్‌డేట్ చేయడమే కాకుండా, తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా వేగంగా విడుదల చేయాల్సి ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story